నిర్ణయాన్ని వెల్లడించిన రాహుల్ గాంధీ

నిర్ణయాన్ని వెల్లడించిన రాహుల్ గాంధీ

ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని కాళ్లకు చక్రాలు కట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఇంకా అనేక అంశాలపై మైకులు విరిచేలా ఉపన్యాసాలిచ్చారు. చౌకీదార్ చోర్ హై అంటూ నినదించారు. పేదలకు న్యాయ్ పథకమంటూ వల విసిరారు. అయినప్పటికీ.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ది ఘోర పరాభవం. సొంత నియోజకవర్గం అమేథీలోనే రాహుల్‌కు ఓటమి తప్పలేదు. కేవలం 52 స్థానాల్లో గెలిచి కనీస ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ పొందలేకపోయింది.

ఓటమితో కాంగ్రెస్‌లో తీవ్ర నైరాశ్యం. ఫలితాల తర్వాత సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. అధ్యక్ష పదవిలో కొనసాగలేనని తెగేసి చెప్పారు. తన కుటుంబ సభ్యులు కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ రాహుల్ నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించలేదు. ఆయనే కొనసాగాలని నేతలు విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి రాహుల్ కు బుజ్జగింపులు మొదలయ్యాయి. సీనియర్లంతా రాహుల్ వద్దకు క్యూ కట్టారు.

పార్టీ అధ్యక్షపీఠం సంక్షోభం కొలిక్కి రాకముందే పార్లమెంటరీ పార్టీ నేత ఎవరనేది తెరపైకొచ్చింది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవి వద్దొంటున్న రాహుల్ కే ఈ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వెలువడ్డాయి. చివరికి సోనియానే ఆ పదవిలో కొనసాగాలని నిర్ణయించారు. పార్లమెంటు హాలులో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కీలకమైన నిర్ణయం ఇదే.

పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాను ఎన్నుకోవడం లోక్‌సభలో కాంగ్రెస్‌కు కాస్త అనుకూలించే విషయమే. మాయావతిలాంటి వాళ్లు రాహుల్‌ను పెద్దగా లెక్కచేయట్లేదు. అదే సమయంలో సోనియాతో అందరికీ, మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌కు ఇతర విపక్ష పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. లోక్‌సభాపక్షనేత ఎవరో స్పష్టత వచ్చిన నేపథ్యంలో పార్టీ రథసారధి ఎవరనేది తేలాల్సి ఉంది.

Tags

Next Story