ఎట్టకేలకు మౌనాన్ని వీడిన రాహుల్ గాంధీ

ఎట్టకేలకు మౌనాన్ని వీడిన రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు పట్టుబడుతున్న రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఎప్పటిలాగే తనదైన శైలిలో బీజేపీపై, నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రతిరోజూ పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సాధించాల్సిన అవసరముందని, దానిని మనం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్‌కు రెండోసారి ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు సాధించడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అప్పటి ఎన్డీయే ప్రభుత్వం నిరాకరించింది. నిబంధనల మేరకు సరిపడా సీట్లు సాధించని కారణంగా ప్రతిపక్ష పార్టీ అర్హత కాంగ్రెస్‌కు ఇవ్వలేమని వివరించింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసినా బీజేపీ నో చెప్పింది.

ఈసారి కూడా కాంగ్రెస్‌ పరిస్థితి అదేవిధంగా తయారైంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం అంటే 54 మంది ఎంపీలు ఉండాలి. కానీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 సీట్లకే పరిమితమైంది. తమకు సంఖ్యా బలం లేని కారణంగా ప్రతిపక్ష నాయకుడి హోదాను కోరుకోవడం లేదని ఆ పార్టీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ను అధికారికంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించాలా వద్దా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story