ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన తెలంగాణ రాష్ట్రం

ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన తెలంగాణ రాష్ట్రం

ఇవాళ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. అన్ని జిల్లాల్లోనూ ఈ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.. పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు.. జిల్లాల్లో జరిగే ఉత్సవాలకు మంత్రులు హాజరవుతారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త పథకాల ప్రకటన ఉండకపోవచ్చు..

ఉదయం 8 గంటల 45 నిమిషాలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటల 5 నిమిషాలకు పబ్లిక్ గార్డెన్‌లో 20 ఫీట్ల ఎత్తులో ఉన్న జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతు సమన్వయ సమితుల సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉదయం పదిన్నరకు జూబ్లీహాల్లోఅన్ని శాఖల ఉన్నతాధికారులు, అధికారులకు ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11న్నరకు కవిసమ్మేళనం జరుగనుంది.

ప్రతి ఏడాది మాదిరిగానే ఏడాది ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ జూబ్లీహాల్లో అవతరణ వేడుకలు నిర్వహించాలని నిర్వహించారు కేసీఆర్. దాదాపు 5వేల మంది వీక్షించేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఎల్.ఇ.డి స్క్రీన్‌ల ఏర్పాటుతో పాటు వేస‌వి దృష్ట్యా మంచినీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించారు. పతాక ఆవిష్కరణ తర్వాత ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేయాల్సిన పనుల గురించి వివరిస్తారు.

అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గ‌న్ పార్క్ వ‌ద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.. అమ‌ర‌వీరుల స్థూపాన్ని రకర‌కాల పుష్పాల‌తో అలంకరించారు..సచివాలయం, అసెంబ్లీ, నక్లెస్ రోడ్డు, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. జిల్లాల్లో సైతం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరణ బాధ్యతలను మంత్రులు, సలహాదార్లకు అప్పగించారు సీఎం కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story