హోంమంత్రి అమిత్ షాకు సవాళ్లు స్వాగతం..

కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా.. దేశ భద్రతకే పెద్ద పీట వేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వానికి దేశ భద్రత, ప్రజా సంక్షేమమే కీలక ప్రాథమ్యాలని తెలిపారు. వీటిని అమలు చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు.
హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమిత్ షా.. కార్యచరణలోకి దిగిపోయారు. నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్, ఇతర అధికారులు అమిత్ షాకు స్వాగతం పలికారు. మరోవైపు హోం శాఖ సహాయ మంత్రులుగా జి. కిషన్ రెడ్డి, నిత్యానంద రాయ్ బాధ్యతలు స్వీకరించారు.
కీలక మంత్రి పదవి చేపట్టిన అమిత్ షాకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వ విధానాల్లో అక్రమ వలసలను అరికట్టడం, ఉగ్రవాదంపై పోరాటం ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ-కశ్మీరులో పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత అమిత్ షాపై పడుతుంది. అస్సాంలో జాతీయ పౌరుల జాబితా ప్రచురణ తర్వాత తలెత్తే పరిస్థితులను కూడా చక్కదిద్దవలసి ఉంటుంది. ఇవాళ అమిత్ షా.. ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమొరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పిస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com