ఆంధ్రప్రదేశ్

యూనివర్సిటీలో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం.. స్పందించిన అధికారులు

యూనివర్సిటీలో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం.. స్పందించిన అధికారులు
X

కడప యోగి వేమన యూనివర్సిటీ అక్రమాలకు కేంద్రంగా మారింది. అఫిలియేషన్‌లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. దీనిపై టీవీ 5 వరుసగా ఎన్నో కథనాలు ప్రసారం చేసి, అధికారులను దృష్టికి తీసుకెళ్లింది. టీవీ 5 కథనాలు వాస్తవమని తేలడంతో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ అధికారులు కడప శ్రీహరి కాలేజీ, ప్రొద్దుటూరు వెంకటేశ్వర, పులివెందుల చైతన్య కాలేజీ.. రాయచోటి షిర్టీసాయి, వైవీఎన్నార్‌ కాలేజీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

అఫిలియేషన్ అక్రమాల విషయానికి వస్తే.. డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినప్పుడే రిజిస్ట్రార్ పేరు మీద సంయుక్తంగా ఖాతా తెరవాలి. అందులో రెండు లక్షల రూపాయిల కార్పస్ ఫండ్ ను ఉంచాలి. ఇది తప్పనిసరి. కానీ ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. అయితే కడప, రాయచోటికి చెందిన మెజార్టీ కాలేజీల కార్పస్ ఫండ్ వివరాలను టీవీ5 సేకరించగా ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. చాలా కాలేజీలు నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచి, లేని డబ్బును ఉన్నట్టుగా కలర్ జెరాక్స్ లు సృష్టించాయి. అవే యూనివర్సిటీకి ఇచ్చాయి. డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయలేదు సరికదా… ఫోర్జరీ సంతకాలతో మాయ చేశాయి. ఇది చాలా తీవ్రమైన నేరం. తప్పుడు ధృవీకరణ పత్రాలతో అఫిలియేషన్ పొందిన కాలేజీలు.. ప్రభుత్వాన్ని కూడా మోసం చేశాయి.

కొన్ని కాలేజీలు భూమి విషయంలోను అక్రమాలకు పాల్పడ్డాయి. కాలేజీ సొసైటీల పేరుతో ఉండాల్సిన కోట్లాది రూపాయిల విలువైన భూమి పత్రాలను తమ పేరుమీదే ఇన్నాళ్లు ఉంచుకున్నాయి. దీనిపై కూడా టీవీ 5 కథనాలు ప్రసారం చేసింది. వీటిపై ప్రభుత్వం స్పందించి సీబీసీఐడీ అధికారులతో విచారణ జరిపిస్తోంది. అధికారులు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లోని కాలేజీల్లో సోదాలు చేశారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడ్తున్నాయి.

Next Story

RELATED STORIES