మోదీ-అమిత్ షాలకు షాక్
కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని గుర్రుగా ఉన్న నితీష్ కుమార్, ఆ కోపాన్ని ఇన్‌డైరెక్టుగా చూపించారు. కేబినెట్ విస్తరణ చేసి 8 మందికి పదవులు కట్టబెట్టిన నితీష్… బీజేపీకి ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో BJP-JDU సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణలో కమలదళానికి అవకాశం ఇవ్వకపోవడం ప్రకంపనలు రేపు తోంది.
తాజా విస్తరణతో బిహార్ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 33కు చేరింది. మరో ఏడాదిలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే చివరి కేబినెట్ విస్తరణ అని ప్రచారం జరుగుతోంది. ఇది ఓ రకంగా బీజేపీకి వార్నింగ్ సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోదీ-అమిత్ షాలకు షాక్ ఇవ్వడానికే, కేబినెట్ విస్తరణలో బీజేపీని పట్టించుకోలేదని అంటున్నారు.
గతవారం జరిగిన కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారంలో జేడీయూకి ఒక్క మంత్రి పదవే ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది… రెండు పదవులు దక్కుతాయని ఆశించిన నితీశ్‌కుమార్ ఈ ప్రతిపాదనతో ఒకింత అసంతృప్తికి గురయ్యారు. దీంతో మోదీ క్యాబినెట్‌లో చేరలేదు. తాము క్యాబినెట్‌లో చేరకపోయినా ఎన్డీయేలో కొనసాగుతామని స్పష్టం చేశారు నితీష్… ఇది జరిగిన మూడు రోజుల్లోనే అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బీజేపీకి చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న ఖాళీలన్నీ జేడీయూ కోటావేనని, అందుకే కేవలం తమ పార్టీ ఎమ్మెల్యేలనే చేర్చుకున్నామని నితీశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, తమకు బీజేపీతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాజా విస్తరణతో నితీశ్ మంత్రవర్గంలో సభ్యుల సంఖ్య 33కు చేరుకుంది. నిబంధనల ప్రకారం మరో ముగ్గురికి అవకాశం ఉంటుంది. మోదీ తన క్యాబినెట్‌లో బీహార్‌లోని అగ్రవర్ణాలకు చోటు కల్పించగా, నితీశ్ మాత్రం వెనుకబడిన కులాలు, దళితులను తీసుకున్నారు. బీజేపీ నాయకత్వానికి ఝలక్ ఇవ్వ డానికే నితీష్ కుమార్ మంత్రివర్గ విస్తరణ బాటను ఎంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు మంత్రివర్గ విస్తరణ జేడీయూ, బీజేపీలో చిచ్చు రేపింది… ఆదివారం సాయంత్రం ఇరు పార్టీలు పోటాపోటీగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చాయి… జేడీయూ ఇచ్చిన విందులో బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు… అలాగే బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుషీల్ మోదీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో జేడీయూ నేతలు కనిపించలేదు… దీంతో రెండు పార్టీల మధ్య అభిప్రాయబేధాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి…
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com