రూ. 2 కోట్ల 20లక్షలు స్వాహా చేసిన రైల్వే అకౌంట్స్ అసిస్టెంట్!

సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి ఏకంగా రెండు కోట్ల 20లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తేలింది. రైల్వేశాఖలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించారు. నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించిన కుంభకోణంలో రైల్వే అకౌంట్స్ అసిస్టెంట్ గణేశ్‌కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది. రైల్వే విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.

మొత్తం 31 నకిలీ ఫార్మా బిల్లులను సృష్టించి.. మూడు బోగస్‌ సంస్థల ఖాతాల్లో నగదు జమచేశాడు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్‌ ఫైనాన్సియల్‌ అడ్వైజరీ కార్యాలయంలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గణేశ్‌, సాయి బాలాజీ ఫార్మా, శ్రీ వినాయక ఏజెన్సీస్‌, శ్రీ తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌ల పేరుతో బోగస్‌ మెడికల్‌ ఏజెన్సీలను సృష్టించాడు. వేర్వురుగా 31 నకిలీ ఫార్మా బిల్లులను తయారు చేశాడు. తన ఇంటిగ్రేటెడ్‌ పేరోల్‌ అండ్‌ అకౌంటింగ్‌ సిస్టం యూజర్‌ ఖాతా ద్వారా రైల్వేశాఖకు చెందిన రెండు కోట్ల 20 లక్షల రూపాయల నిధులను బోగస్‌ ఏజెన్సీల ఖాతాలకు బదిలీ చేశాడు.

విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ హైదరాబాద్‌ విభాగం.. ఐపీసీ 420, 409, 468, 471తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మరి కొందరు రైల్వే అధికారులకు ఈ కేసుతో సంబంధమున్నట్లు దర్యాప్తు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. మూడు బోగస్‌ సంస్థలను సృష్టించేందుకు బయటి వ్యక్తులు సహకరించారని గుర్తించారు. త్వరలో మరికొన్ని అరెస్టులుంటాయని సీబీఐ అధికారులు తెలిపారు. మరోవైపు గణేశ్‌కుమార్‌పై రైల్వే శాఖ వేటువేసింది.

Tags

Read MoreRead Less
Next Story