24 గంటలు గడిచినా లభ్యంకాని ఏఎన్32 విమానం ఆచూకీ

24 గంటలు గడిచినా లభ్యంకాని ఏఎన్32 విమానం ఆచూకీ

ఏఎన్-32 విమానం సోమవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైంది. ఆ విమానంలో ఏడుగురు అధికారులు, మరో ఆరుగురు ప్రయాణికులున్నారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకుఅసోంలోని జోర్హాట్‌ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దాని ఆచూకీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మారుమూలన ఉన్న మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ విమానం నుంచి చివరిసారిగా కమ్యూనికేషన్‌ వచ్చింది. ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా మెచుకాకు చేరుకోవడానికి 50 నిమిషాలు మాత్రమే పడుతుంది.

సోవియట్ యూనియన్ రూపొందించిన ఏఎన్-32 విమానాలను 1980లో భారత వైమానికదళంలో చేర్చారు. నాలుగు దశాబ్దాలుగా రవాణా అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఏఎన్-32 శ్రేణి విమానాల్లో రెండు టర్బోప్రాప్‌ ఇంజిన్లు ఉన్నాయి. పలుమార్లు ఈ విమానాలను ఆధునికీకరించారు. ఐతే అరుణాచల్‌లో అదృశ్యమైన ఆ విమానాన్ని ఆధునీకరించనట్లుగా తెలుస్తోంది.

గతంలోనూ ఏఎన్-32 విమానాలు కూలిపోయాయి. 2016లో చెన్నై నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవులకు బయలుదేరిన ఏఎన్‌-32 విమానం బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా అదృశ్యమైంది. ఆ విమానం కోసం సుదీర్ఘ కాలం పాటు గాలింపు జరిగింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. కనీసం శకలాలు కూడా దొరకలేదు. దాంతో ఆ విమానంలో ఉన్న 29 మంది మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. 2009 జూన్‌లో మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో మరొ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో 13 మంది మరణించారు.

Tags

Next Story