వాడని మల్లెల సుగంధం.. బాలూ స్వరం.. గాన గంధర్వుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

వాడని మల్లెల సుగంధం.. బాలూ స్వరం.. గాన గంధర్వుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మాములుగా కోయిల గానం అద్భుతంగా వుంటుందని అంటారు. లాలి పాటలు, చందమామ పాటలు చాలా ప్రశాంతంగా వుంటాయని చెబుతూవుంటాం. కానీ ఆయన పాటలు వింటుంటే.. ఆ రెండూ మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. నీరసంగా వుంటే ఎనర్జీ, బాధలో ఓదార్పు, పార్టీ సమయంలో ఎంజాయ్ మెంట్, పడుకునే ముందు హాయిదనం, దేవుడితో నేరుగా మొర పెట్టుకోవడం... ఇలా అన్ని సందర్భాలకు తగ్గట్లుగా.. ఆలపించడం.. ఆయన ప్రత్యేకత.. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని వేరే చెప్పాలా..? నిన్న ఈ గాన గంధర్వుడి పుట్టిన రోజు..

ఎక్కడో ఇంజినీరింగ్ చదువుకుంటున్న కుర్రాడు.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గాత్రం ఉంది. కానీ సంగీత పరిజ్ఞానం పూర్తిగా లేదు. అయినా తన గానంతో ఎన్నో గొప్ప సాహిత్యాలకు ప్రాణం పోశారు. మరెన్నో స్వరాలకు తనదైన శైలిలో ప్రాణప్రతిష్ట చేశాడు.. చెన్నైలో ఇంజినీరింగ్ చదువుకుంటున్న బాలసుబ్రహ్మణ్యాన్ని సినిమా తన మాయలో వేసుకోలేదు.. కానీ తర్వాత ఆయన మాయలో ఎంతో మంది ప్రేక్షకులు పడిపోయారు..

ఎస్ పి కోదండపాణి.. 60,70 దశకాల్లో గొప్ప సంగీత దర్శకులు.. ఆయనే బాలులోని టాలెంట్ ను ముందుగా గుర్తించింది. గుర్తించడమే కాదు, ‘‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’’ చిత్రంతో తొలి అవకాశమూ ఇచ్చారు.. బాలులోని విద్వత్తును ముందుగా ఎలా గుర్తించగలిగారో కానీ, ఆయన సెలెక్షన్ తప్పుకాలేదు. తర్వాత అదే గాత్రం కొన్ని వేల పాటలతో సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది.

తర్వాత తమిళంలో పాడిన పాటలో అక్షర దోషాలున్నాయని ఎవరో చెబితే రెండేళ్ల వరకూ తమిళం నేర్చుకున్న తర్వాతే మళ్లీ కోలీవుడ్ పాట పాడిన ఘనత బాలు సొంతం. కోదండపాణి కోపరేషన్ తో తెలుగులో వరుసగా పాడటం మొదలుపెట్టారు. ఆయన తన వెంట కచేరీలకు తీసుకువెళుతూ బాలులోని గానకళకు మెరుగులు దిద్దుతూనే అవకాశాలిచ్చి మరీ ప్రోత్సహించారు.. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాతి తరం కృష్ణ, శోభన్ బాబులతో పాటు కొందరు కమెడియన్స్ కు పాటడం మొదలుపెట్టారు..

సినీ సంగీతంతో మేరుపర్వతంలాంటి ఘంటసాల మాష్టారు.. సుశీలమ్మ, జానకి, పిఠాపురం, మాధవపెద్ది, పిబి శ్రీనివాస్ లాంటి వారు చాలా గొప్పగా పాడుతున్న టైమ్ లోనే బాలు ఎంటర్ కావడం యాధృచ్చికమే అయినా .. ఘంటసాల తర్వాత తనే తెలుగు సినిమాకు పెద్ద దిక్కు అవుతానని అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. అదే టైమ్ లో బాలు ప్రతిభ కనిపెట్టిన దర్శకులు, సంగీత దర్శకులు చాలా వరకూ ఆయన్ని ప్రోత్సహించడం కూడా బాగా కలిసొచ్చిన అంశమే..

కర్ణాటక సంగీతం నేర్చుకుంటే సినిమా పాటలు పాడగలరు అనేది అందరికీ తెలుసు. అలాంటి కర్ణాటక సంగీతమే పెద్దగా రాని బాలు హిందూస్థానీ పాడతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆ ఊహ నిజమయ్యేలా చేసింది కెవి మహదేవన్ తో పాటు కె విశ్వనాథ్. అద్భుతమైన వాద్య కళకారులతో బాలు పాడిన ఆ పాటలు శంకరాభరణం చిత్రంలోనివి. నా వల్ల కాదు అని తనే స్వయంగా చెప్పినా.. నీ వల్ల అవుతుందని ధైర్యంగా పాడించారు సంగీత దర్శకుడు కెవి మహదేవన్.. ఆ పాటలకు జాతీయ అవార్డ్ రావడం బాలు ప్రతిభకు నిదర్శనం.

‘‘ఎవరికి పాడుతున్నామో వారే పాడినట్టు ఉండాలని’’ ఓ సారి ఘంటసాల చెప్పిన సలహా మేరకు ఆ దిశగా సాధన చేసిన బాలు చివరికి ఆయనే ఆశ్చర్యపడేంతగా ‘గాన మిమిక్రీ’లో రాటు దేలిపోయాడు. ఆఖరుకి కమెడియన్స్ కు పాడినా వారే పాడుతున్నారేమో అన్నంతగా తన గాత్రాన్ని సరి చేసుకున్నాడు..

ఈ విషయంలో బాలు సాధించిన పరిణతి తర్వాత మరే గాయకుడూ సాధించలేదు. అందుకే మరే గాయకుడూ బాలుకు పోటీ ఇవ్వడం కాదు కదా.. ఆ దిశగా ఊహించడం మానేశారు. కమెడియన్స్ నుంచి స్టార్ హీరోల వరకూ అందరి గొంతునూ ఇట్టే పట్టేసి తానే వారి గొంతుతో పాడుతున్నట్టుగా ఉండే బాలు మాత్రమే ఉంటే చాలు అనుకుంది పరిశ్రమ.. అందుకే ఎన్నో ఏళ్లపాటు ఆ గాన గంధర్వుడి పాట మనందరినీ మరో లోకంలో విహరింప చేస్తోంది.

ఇంతింతై గాయకుడింతై అన్నట్టుగా శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినీ సంగీతంలో గాయక రారాజు గా మారాడు. ఇదే టైమ్ లో ఘంటసాల ఆగిపోవడంతో బాలు మొదటి ఆప్షన్ గా మారాడు . ఘంటసాల తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు తన ప్రతిభతో తనేనన్న సమాధానం చెప్పాడు. అలా దాదాపు మూడు దశాబ్ధాల వరకూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వేల పాటలకు ప్రాణం పోశాడు. ఎన్నో జాతీయ, ప్రాంతీయ అవార్డులు గాన గంధర్వుడి ప్రతిభకు పాదాక్రాంతం అయ్యాయి.

ఇప్పుడు పరభాషా గాయకుల వల్ల తెలుగు భాష ఖూని అవుతుందని చెబుతున్నాం.. కానీ అలాంటి ఖూనీలేం లేకుండా బాలీవుడ్ లో ఏక్ దూజేకేలియే చిత్రంతో అద్భుతమైన ఉచ్ఛారణతో అలరించాడు బాలు. తర్వాత సాజన్, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్.. లాంటి సినిమాల్లోని పాటలతో బాలీవుడ్ నూ ఓ ఊపుఊపేశాడు బాలు..

ఇక చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి కామెడీ హీరోలకూ వారి గొంతులతోనే పాడి మెప్పించారు. అంతే కాదు, డబ్బింగ్ చెప్పించుకున్నా సుమన్, రాజశేఖర్ లాంటి హీరోలకూ అదే స్థాయిలో గానాభినయం ప్రదర్శించాడు బాలు..

తర్వాత ఘంటసాల స్ఫూర్తితో సంగీత దర్శకుడిగానూ రాణించారు బాలు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 40 చిత్రాల వరకూ సంగీతాన్నందించారు. అయితే ఘంటసాల లాగా మెమరబుల్ హిట్స్ తక్కువగా ఉన్నాయి బాలుకు. అందుకు కారణం గాయకుడిగా ఆయనెంతో బిజీగా ఉండటమే అంటారు కొందరు. అదీ నిజమే.. రెండు పడవల పై కాళ్లు వేయడం వల్లే సంగీతంలో కొంత నాణ్యత తగ్గిందనుకోవచ్చు..

ఓ గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కాదు. 1981 ఫిబ్రవరి 8వ తేదీన ఒకేసారి 17 పాటలు పాడి రికార్డ్ ను సృష్టించారు. అలాగే తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలను ఒక్కొక్క రోజు చొప్పున పాడి వారెవ్వా అనిపించుకున్నారు. నటుడిగానూ45 సినిమాలలో ఎన్నో రకాల పాత్రలను ధరించారు. అనేక రకాల సీరియల్స్ లోనూ నటించి, తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.

అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుగానూ బాలు సాధించిన విజయాలు తక్కువేం కాదు.. ఎన్నో పాటలకు రాగాలతో ప్రాణం పోసినట్టే మరెన్నో పాత్రలకు తన గాత్రంతో ఊపిరి పోశారు. అందులో ముఖ్యంగా అన్నమయ్యలో సుమన్ కు వెంకటేశ్వర స్వామిగా బాలు చెప్పిన డబ్బింగ్ సినిమాకే హైలెట్ అంటే అతిశయోక్తి కాదేమో..

ఇప్పుడు వస్తోన్న సంగీతంలోని విపరీత పోకడలను నిరసిస్తూ తనకు నచ్చితేనే పాడుతూ వస్తోన్న బాలు కొత్తతరం గాయకులను ప్రోత్సహిస్తూ టీవీల్లో నిర్వహిస్తోన్న ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎందరో ప్రతిభావంతమైన గాయకులను తెలుగు తెరకు అందిస్తూ ఇప్పడు తెర వెనక పాత్రనూ సమర్థవంతంగా పోషిస్తున్నారు..

పాటలో మాటని, గళంలో అభినయాన్ని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత బాలు ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి వుంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు.. బాలసుబ్రహ్మణ్యం..

Tags

Read MoreRead Less
Next Story