అమెరికాలో సైతం బ్యాలెట్‌ పేపరే వాడుతున్నారు: మమత

అమెరికాలో సైతం బ్యాలెట్‌ పేపరే వాడుతున్నారు: మమత

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్డీఏ అఖండ మెజారిటీతో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విపక్షాలు మరోసారి ఈవీఎంలపై అభ్యంతరాలను లేవనెత్తడం హాట్‌ టాపిగ్గా మారింది. ఈవీఎంలపై మరోసారి పోరుబాట పట్టారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అసలు గెలుపే కాదా? ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే కమలం ఢిల్లీ కోటలో పాగా వేసిందా? అవుననే అంటున్నారు దీదీ. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మమత. వాటిలో లోపాలను ఎత్తి చూపుతున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని ఆరోపించిన మమతా.. ఈవీఎంల్లో వచ్చిన ఫలితాలు ప్రజా తీర్పు కాదంటూ చెప్పుకొచ్చారు. బ్యాలెట్ పేపర్ల ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని…ఈవీఎంల ద్వార ఓటింగ్ నిర్వహంచాలని తాము కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ నిర్వహించి… ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు మమతా.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మమతా బెనర్జీ. ఈనేపథ్యంలోనే బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ అధికారాన్ని, డబ్బును ఉపయోగించి ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసిందని విమర్శించారు. ఈవీఎం మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని.. బ్యాలెట్‌ పేపర్‌ కోసం అవసరమైతే దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. అమెరికాలో సైతం బ్యాలెట్‌ పేపరే వాడుతున్నట్లు మమత గుర్తు చేశారు.

ఈవీఎంలపై ఉద్యమం బెంగాల్ నుంచే ప్రారంభం కావాలన్న మమతా.. 23 ప్రతిపక్ష పార్టీలు దీనిపై కలిసి వచ్చి…బ్యాలెట్ పత్రాల కోసం డిమాండ్ చేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story