పిల్లాడికి అమ్మమ్మనంటూ పుట్టిన పసికందును తీసుకొని పరార్..
అప్పుడే పుట్టిన పసికందును అపహరించుకుపోయింది ఓ మహిళ. పిల్లాడికి అమ్మమ్మను అవుతానంటు నర్సులను బురిడి కొట్టించింది. చిన్నారిని తీసుకొని ఆస్పత్రి నుంచి పరారైంది. ఆస్పత్రి సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలన్ని రికార్డ్ అయ్యాయి. దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మూడు గంటల్లోనే చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.
నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన లక్ష్మి.. మంగళవారం రాత్రి పది గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టిన సంతోషంలో బంధువులు ఉండగా.. ఓ మహిళ నర్సు దగ్గర్నుంచి శిశువును తీసుకుంది. తాను అమ్మమ్మను అంటూ నమ్మించింది. అదును చూసుకొని ఆస్పత్రి నుంచి ఉడాయించింది. చిన్నారి కోసం బంధువులు ఆరా తీయగా.. బాబును తీసుకెళ్లిన మహిళ కిడ్నాపర్ అని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఆస్పత్రి సిబ్బంది.
ఆస్పత్రిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. పిల్లాడ్ని ఎత్తుకెళ్లిన మహిళది కోవూరుగా గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. పసిబిడ్డతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని పాపను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పుట్టిన గంటల్లోనే బాబు కిడ్నాప్ అవటంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. పోలీసుల చొరవతో మూడు గంటల్లోనే తల్లి ఒడికి చేరటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com