వరల్డ్ కప్.. టీమిండియాలో వాళ్లు రాణిస్తే పరుగుల వరద ఖాయం

వన్డే వరల్డ్ వార్ మొదలై వారం గడిచిపోయింది. 10కిపైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. కానీ ఎలాంటి జోష్ లేదు. అసలు ఇండియన్ ఫ్యాన్స్ కైతే వరల్డ్ కప్ జరుగుతుందన్న ఫీలింగే లేదు. కారణం ఇప్పటి వరకు మన కోహ్లీసేన బరిలోకి దిగకపోవడమే. మన మ్యాచ్ ఎప్పుడా అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఇవాళ పండుగే. క్రికెట్ సమరంలో అసలు యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికాసేపట్లో టీమిండియా.. సౌతాఫ్రికాను ఢీకొట్టబోతోంది. IPLలో ధనాధన్ క్రికెట్ తో అదరగొట్టేసిన మన ఆటగాళ్లు .. వన్డే వార్ లోనూ అదే జోరుకొనసాగిస్తారని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

IPLలో తర్వాత దాదాపు 20 రోజుల గ్యాప్ దొరికింది టీమిండియాకు. దీంతో జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. కెప్టెన్ కోహ్లీ, మిస్టర్ కూల్ ధోనీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఈ ముగ్గురు బ్యాట్ కు పనిచెబితే ఈ ప్రపంచకప్ యుద్ధంలో మనకు తిరుగే ఉండదు. ఇక బౌలింగ్ దళం కూడా బలంగానే ఉంది. బూమ్రా, భువనేశ్వర్, షమితో పేస్ విభాగం బలంగా ఉంది. ఇక చాహల్, కుల్దీప్ యాదవ్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వీరికి మంచి ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్య మెరుపులు కూడా తోడైతే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు చక్కలు కనపడటం ఖాయం.

ఓపెనింగ్‌లో రోహిత్‌, ధావన్‌.. వన్‌డౌన్‌లో విరాట్‌.. నాలుగో నంబరులో రాహుల్‌.. వికెట్‌ కీపర్‌గా ధోని.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య స్థానాలకు ఢోకా లేదు. పేసర్లు ముగ్గురా? ఇద్దరా? అన్న దానిపైనే తుదిజట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలో దిగితే బుమ్రా, షమి, భువనేశ్వర్‌ తుదిజట్టులో ఉంటారు. అప్పుడు హార్దిక్‌తో కలిపి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో టీమ్‌ఇండియా బరిలో దిగుతుంది. స్పిన్‌ కోటాలో కుల్‌దీప్‌యాదవ్‌ లేదా చాహల్‌లలో ఒకరికి అవకాశం లభించనుండగా మిగిలిన ఒక స్థానం కోసం జడేజా, కేదార్‌ జాదవ్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. తుదిజట్టులో జడేజాకు చోటు దక్కే అవకాశాలే అధికం. ఒకవేళ ఇద్దరు ప్రధాన పేసర్లతో ఆడితే భువనేశ్వర్‌ స్థానంలో జాదవ్‌కు అవకాశం లభిస్తుంది.

అటు సౌతాఫ్రికా పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది.. ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో ఆ జట్టు ఓటమి చవిచూసింది. అటు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టు టీమిండియాకు పోటీ ఇవ్వడం కాస్త కష్టమే..ముఖ్యంగా ఆజట్టు బౌలింగ్ లో పెద్దగా పసలేనట్లు కనిపిస్తోంది.. ఎందుకంటే..ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లకు ౩వందలకుపైగా స్కోర్లను సమర్పించుకుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్‌.. రెండో మ్యాచ్‌లో తేరుకున్నా ఫలితం లేకపోయింది. వరుసగా రెండు ఓటములతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మానసికంగా ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. అయితే కాస్త వీక్ గా కనిపిస్తున్నా ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్‌ లో రెండు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సౌతాంప్టన్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోంది.. నిన్నటి వరకు వికెట్‌ పచ్చికతో కళకళలాడింది. ఆ తర్వాత గ్రాస్ ను పూర్తిగా తొలగించారు. బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టొచ్చు. వర్షం పడినా.. వాతావరణం చల్లగా ఉన్నా పేసర్లు ప్రభావం చూపొచ్చు. అయితే ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడే అవకాశముంది.

Tags

Next Story