తీపి కబురు..మరో రెండు రోజుల్లో..

నైరుతీ రుతురాగాలు రెండ్రోజుల్లో పలకరించబోతున్నాయి. ఈనెల 7 లేదా 8వ తేదీన రుతుపవనాలు కేరళను తాకబోతున్నట్లు ప్రకటించింది వాతావరణశాఖ. వాస్తవానికి జూన్ ఒకటినే రుతుపవనాలు రావాల్సి ఉన్నా... ఈ సారి ఆలస్యమైంది. అయితే...ఖరీఫ్‌కు కీలకమైన జూలై, ఆగస్టులో వర్షాలు భారీగా కురుస్తాయని వెల్లడించింది ఐఎండీ.
:దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు రెండు రోజుల్లో రానున్నాయి. సాధారణంగా ఏటా జూన్ 1వ తేదీన రుతుపవనాలు రావాల్సి ఉన్నా.. ఈ సారి ఆలస్యమైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఈనెల 7 లేదా 8 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం మేఘాలు పశ్చిమ వైపు నుంచి తూర్పు దిశగా కదులుతున్నాయని.. ఎప్పుడైతే రుతుపవనాలు ప్రవేశిస్తాయో.. మేఘాలు దిశ మార్చుకుంటాయని.. వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి ప్రవేశానికి అనుకూలమైన వాతావరణమే ఉందని IMD స్పష్టంచేసింది.
ఈనెల 7న రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశముంది. ఫలితంగా కేరళతో పాటు తమిళనాడు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో సహా.. వివిధ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అవి రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు కాదని అధికారులు చెప్తున్నారు.
వాయవ్య భారతంలో 94 శాతం, మధ్యభారతంలో వంద శాతం, దక్షిణాదిలో 97 శాతం, తూర్పుభారతంలో 91శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. ఖరీఫ్‌ను కీలకమైన జూలై, ఆగస్ట్ నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని వెల్లడించింది. ఫసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com