అది జరిగితేనే.. బీజేపీలో చేరుతా.. కుండబద్దలు కొట్టిన కేశినేని నాని

సార్వత్రిక ఫలితాలు వచ్చి పట్టుమని పది రోజులు గడవకముందే టిడిపిలో భిన్న స్వరాలు వినిపిపిస్తున్నాయి. అంతా కలిసి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా విజయవాడ ఎంపి కేశినేని నాని ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఛీప్ చంద్రబాబు నానికి పార్లమెంట్ విప్ పదవి ఇవ్వడంతో.. ఆయన ఒక్కసారిగా స్వరం పెంచారు. తనకు విప్ పదవి అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. విజయవాడ ఎంపి పదవి కంటే ఏది తనకు ఎక్కువ కాదని... విప్ పదవిని వేరే ఎవరైనా సమర్దులైన నాయకులకి ఇవ్వాలంటూ నాని ఫేస్‌బుక్ లో పోస్టు పెట్టడం వివాదస్పదమైంది. అంత పెద్ద పదవి చేయడానికి నేను అనర్హుడిని అంటూ అధినేత ఆదేశాలను పట్టించుకోకుండా నాని కామెంట్స్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే తనకు ఎంతో సంతృప్తి అంటూ నాని పోస్ట్ చేశారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతూనే... విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు కోరారు నాని.
ఇదంతా ఒక ఎత్తయితే నాని పోస్ట్ పెట్టడంతో టీడీపీ హై కమాండ్ అలర్ట్ అయింది. వెంటనే నాని అలకకు కారణాలు తెలుసుకోవాలని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ను రంగంలోకి దింపారు. వెంటనే జయదేవ్ విజయవాడలోని కేశినేని భవన్‌కు వచ్చి నానితో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. నాని అలకకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు రంగంలోకి దిగి నేరుగా నానికి ఫోన్ చేసి మాట్లాడారు. సాయంత్రం నివాసానికి రావాలని నానిని, గల్లాను కోరారు చంద్రబాబు. దీంతో ఇద్దరు ఎంపీలు చంద్రబాబుతో భేటి అయ్యారు.
తాను పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నాని ఖండించారు. చంద్రబాబు వైసీపీలోకి వెళ్తే .. తాను బీజేపీలో చేరుతా అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని.. దానికోసం ఆస్తులు కూడా పోగోట్టుకున్నానని చిట్‌చాట్‌లో చెప్పారు నాని. విప్ పదవి తన స్దాయికి తగదని అందుకే వద్దని చెప్తున్నారు కేశినేని. గతంలో చేయని తప్పునకు రవాణాశాఖా అధికారికి క్షమాపణలు చెబితే... పార్టీ కోసం ఆ అధికారులెవరూ నిలబడలేదని.. ఇవన్నీ చంద్రబాబు గుర్తించాలని అంటున్నారు నాని.
అయితే విప్ పదవిని నాని వదులుకోడానికి పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో గల్లా జయదేవ్ కుటుంబం పెత్తనం.. బెజవాడలో దేవినేని పెత్తనంపై నాని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూర్ ఎంపి గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారికి పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్ పదవి.. గల్లాకు ఎంపి సీటుతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇవ్వడంతోనే నాని మనస్తాపానికి గుర్తైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో గెలవలేని వారు గుంటూరుకు వస్తే ఒకే కుటుంబంలో అన్ని పదవులు ఇవ్వడంపై నాని ఆగ్రహనికి కారణమైనట్లు తెలుస్తోంది. మరోవైపు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమ పార్టీని మొత్తం నాశనం చేస్తున్నారని.. అయినా ఉమ మాటలే పార్టీ నమ్ముతోందని.. నాని పార్టీ నేతల వద్ద అంటున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడలో జరిగిన టిడిపి ఇప్తార్ విందుకు నాని రాకపోవడానికి కూడా ఇదే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అధినేత రంగప్రవేశం చేయడంతో నాని ఎపిసోడ్ ప్రస్తుతానికి సుఖాంతం అయింది. మరి భవిష్యత్‌లో కృష్ణా జిల్లా TDPలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com