తెలంగాణ పరిషత్‌ ఎన్నికలు.. కేసీఆర్ అత్తగారి ఊరులో ఊహించని ఫలితం

తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ప్రముఖుల ఊళ్లలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పాగా వేస్తే...మరికొన్ని ఊళ్లలో ఒకే ఓటుతో అభ్యర్థులు గెలవడం ఆసక్తి రేపింది. ఇక ఇద్దరికి ఓట్లు సమానంగా రావడంతో లాటరీ పద్దతిలో విజేతను ఎంపిక చేశారు ఎన్నికల అధికారులు.తెలంగాణ ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించినా.. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతల స్వగ్రామాల్లో మాత్రం ఓటమి తప్పలేదు. సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత ఇలాఖాలో టీఆర్‌ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు. కేసీఆర్ దత్తత గ్రామం.. కవిత సొంత ఊరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మాజీ ఎంపీ కవిత స్వగ్రామం నవీపేట మండలం పోతంగల్‌లో ఎంపీటీసీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 90 ఓట్లకుపైగా తేడాతో బీజేపీ అభ్యర్థి రాజు గెలవడం ఆసక్తి కరంగా మారింది.

ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో కూడా టీఆర్‌ఎస్‌కు ఓటమే ఎదురైంది. కరీంనగర్‌ జిల్లాలోని కేసీఆర్‌ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలవడం విశేషం. అటు కేసీఆర్ అత్తగారు ఊరు కొదురుపాకలో కూడా టీఆర్ఎస్ ఓటమిని మూటగట్టుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్ధిపై కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారు.ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ రేపాయి. చివరి ఓటు లెక్కింపు వరకు ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూశారు. కొన్ని గ్రామాల్లో ఒకే ఓటు.. గెలుపు ఓటములను నిర్దేశించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామ ఎంపీటీసీగా కాంగ్రెస్‌ అభ్యర్థి పెద్దెడ్ల నర్సింహులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. నర్సింహులుకు 890 ఓట్లు రాగా..టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాయిలుకు 889 ఓట్లు వచ్చాయి.

ఇక మహబూబాబాద్ మండలం శీత్లా తండా ఎంపీటీసీ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి రోజా ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రీకౌంటింగ్‌ నిర్వహించాలని కోరారు. రీకౌంటింగ్‌లోనూ అదే ఫలితం రావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి రోజా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.ఈ ఎన్నికల్లో మరికొంత మంది అభ్యర్థులను అదృష్టం వరించింది. లాటరీ ద్వారా అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వీరెల్లిలో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్ధికి... ప్రత్యర్ధికి సమాన ఓట్లు రావటంతో టాస్ వేశారు. టాస్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు. నిజామాబాద్ ఆర్మూర్ మండలంలో బీజేపీకి, టీఆర్ఎస్‌కు సమాన ఓట్లు వచ్చాయి. టాస్‌లో ఇక్కడ బీజేపీ అభ్యర్ధి గెలుపొందాడు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా సనుగులలో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్ధికి టాస్‌తో అదృష్టం కలిసొచ్చింది. ఆర్మూరు మండలం పిప్రిలో లాటరీ ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story