ఆంధ్రప్రదేశ్

జగన్ కీలక నిర్ణయం.. TTD బోర్డులో..

జగన్ కీలక నిర్ణయం.. TTD బోర్డులో..
X

ప్రతి విభాగంలోనూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. దేవాలయాల పాలకమండళ్ల విషయంలోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 8న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో.. పాలకమండళ్ల రద్దుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. TTD సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండళ్లు రద్దు చేసి, ఆ తర్వాత చట్ట సవరణ ద్వారా కొన్ని మార్పులు చేసి అప్పుడు కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆర్డినెన్స్ తెచ్చిన రోజే.. దాన్ని గవర్నర్‌కు పంపి ఆమోదముద్ర వేయించేలా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత నిబంధనల పాలకమండలి ఛైర్మన్‌ లేదా సభ్యులను తొలగించాలంటే ముందు వారికి నోటీసులివ్వాలి. ఆ తర్వాత మిగతా ప్రక్రియ పూర్తి చేయాలి. ఈలోపు నోటీసులపై సంబంధిత వ్యక్తులు కోర్టుకు వెళ్తే.. వ్యవహారం తేలే వరకూ ఎలాంటి ముందడుగు పడదు. అదే ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసేస్తే.. ఎక్కడా న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం ఉండదు. న్యాయనిపుణుల సూచన మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఏపీ చారిటబుల్‌, హిందూ రిలీజియస్‌ ఇనిస్టిట్యూషన్స్‌, ఎండోమెంట్స్‌ యాక్డ్‌- 1987ను సవరించడానికి కూడా అవసరమైన ప్రక్రియ మొదలైంది.

TTD బోర్డు రాజకీయాలకు కేంద్రం కాకుండా చూసేలా సమూల మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. ధార్మిక వ్యవహారాల్లో ప్రముఖులైన వారిలో ఎక్కువమందికి చోటు కల్పించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే TTD బోర్డులో చాగంటి కోటేశ్వర్రావు, స్వరూపానందేంద్రస్వామి లాంటి వాళ్లకు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం మొదలైంది. ప్రస్తుతమున్న బోర్డును గత ప్రభుత్వం నియమించింది. సాధరణంగా కొత్త సర్కారు ఏర్పడగానే.. బోర్డు చైర్మన్‌ సహా సభ్యులు రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడున్న బోర్డులో ఏడుగురు ఇప్పటికే తప్పుకున్నా.. 11 మంది రాజీనామాకు ససేమిరా అంటున్నారు. సీఎం కూడా ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండానే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి చట్టంలో మార్పులు చేస్తున్నందున.. ఆర్డినెన్స్ తేవడమే సరైన మార్గమంటున్నారు.

ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం సెషన్ ప్రారంభానికి 2 రోజుల ముందు గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ అంటూ వస్తే.. సభా కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ ఎలాంటి ఆర్డినెన్స్‌లకు అవకాశం ఉండదు. కావాలంటే ఆర్డినెన్స్‌ల బదులు అసెంబ్లీ బిల్లు పెట్టి.. తద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ఈ 2 అంశాలను పరిశీలిస్తోంది. 8న కేబినెట్ సమావేశంలో పాలకమండళ్ల రద్దుపై ఆర్డినెన్స్‌ తీసుకురాగానే.. వెంటనే దాన్ని గవర్నర్ వద్దకు పంపనుంది. అలా కుదరని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లోనే వీటి రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES