శ్రీవారిని దర్శించుకునే వీఐపీలపై ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖులు తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒక్కసారే మాత్రమే దర్శించుకోవాలన్నారు. సామాన్యు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు.మంగళవారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సంప్రాదాయ దస్తులు ధరించి వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు...
స్వామి వారి దర్శనం అనంతరం.. వేద పండితుల ఆశీర్వదాం తీసుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేసారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రముఖులు ఏడాదికి ఒక్కసారే శ్రీవారి దర్శనం చేసుకోవాలన్నారు. సామాన్యభక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. .
అనంతరం ... ధర్మగిరిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేదపాఠశాలను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రార్థనా మందిరంలో శ్రీవారి పూజలు, హారతి అనంతరం వేదపఠనం జరిగింది. వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు.
వేదం అంటే జ్ఞానమన్నారు వెంకయ్య. జ్ఞానాంధకారాన్ని పోగొట్టే పవిత్ర శక్తి వేదాలకు ఉందని తెలిపారు. వేదాల ద్వారా ప్రాచీన సంస్కృతి, విజ్ఞానాన్ని సమాజానికి అందిస్తే, విలువలు పెరుగుతాయని చెప్పారు. వేదపాఠశాల నుంచి వెంకయ్య తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఆ తర్వాత అన్నప్రసాదం స్వీకరించారు వెంకయ్య. మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ తిరిగి ఢిల్లీ చేరుకోనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com