టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం సంపూర్ణం

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం సంపూర్ణం

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. విలీన ప్రక్రియ సంపూర్ణమైనట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. దానిపై సానుకూలంగా స్పందించి.. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీని విలీనం చేశారు. సీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ జారీ చేశారు. దీంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 103కు చేరింది.

స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియ, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని పిరాయింపు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని ఆయన తెలిపారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరోవైపు టిఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవ్వడంతో కాంగ్రెస్‌ ప్రతిపక్షహోదా కోల్పోయింది.

Tags

Next Story