పేదింటి ప్రతిభా కుసుమం.. టైలర్ కొడుక్కి 'నీట్‌'లో 55వ ర్యాంకు

పేదింటి ప్రతిభా కుసుమం.. టైలర్ కొడుక్కి నీట్‌లో 55వ ర్యాంకు

బాగా చదువుకోవాలి నాన్న. నాలా టైలర్ కాకుండా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలి అని తండ్రి చెప్పిన మాటలు చెవిలో మారు మోగుతుండేవి. ఎదుగుతున్న క్రమంలో మంచి చెడు చెప్పే నాన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అమ్మ ఒక్కతే కష్టపడుతూ తనని, తమ్ముడిని చదివించింది. అమ్మ కష్టం ఊరికే పోలేదు. కొడుక్కి జాతీయస్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో 55వ ర్యాంకు వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అనిత, లక్ష్మీనారాయణ దంపతులకు కుశ్వంత్, శ్రీకర్ ఇద్దరు కొడుకులు. లక్ష్మీనారాయణ టైలరింగ్ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో ఓ రోడ్డు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

దాంతో అనిత తానే టైలరింగ్ వృత్తిని చేపట్టి బిడ్డల్ని చదివిస్తోంది. కుశ్వంత్, శ్రీకర్‌లు ఇద్దరూ చదువులో ముందుండేవారు. భూపాలపల్లిలోని మాంటిస్సోరి పాఠశాలలో చదివిన కుశ్వంత్ పదోతరగతి పరీక్షల్లో 10/10 మార్కులు తెచ్చుకున్నాడు. అనంతరం హైదరాబాదులోని చైతన్య జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూపుతో ఇంటర్ చదివి 982 మార్కులు సాధించాడు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ పరీక్ష రాసి 55వ ర్యాంకు తెచ్చుకున్నాడు. కాగా, కుశ్వంత్ తమ్ముడు శ్రీకర్ ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. అన్నని స్ఫూర్తిగా తీసుకుని అతడు కూడా చదువుపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఇద్దరు బిడ్డల్ని చూసుకుని ఆ తల్లి తను పడుతున్న కష్టాన్ని మరిచిపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story