ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎవరికి పనిచేస్తారంటే..
వైసీపీ ప్రకటించిన నవరత్నాలకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐపాక్ టీమ్ విజయంతమైంది. ప్రచారం మొదలుకొని పథకాల రూపకల్పన వరకు తనదైన ముద్రవేసి జగన్ విజయానికి దోహదపడ్డారు పీకే. ఏపీ టూ బెంగాల్...టీఎంసీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జగన్ పార్టీ అఖండ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర, ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపకల్పన ఇలా అన్నింటిలోనూ జగన్‌కు సలహాలు సూచనలు ఇస్తూ వైసీపీని విజయం వైపు నడిపించారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ బెంగాల్‌కు వెళ్లారు. కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రెండు గంటల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం.
2021లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీకి పనికిచేసినట్లుగానే.. బెంగాల్‌లోనూ మమత బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రాజకీయ చాణక్యుడిగా పేరున్న ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి సేవలందిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించవచ్చని మమత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో సమావేశమై టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసే అంశంపై మంతనాలు జరిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో టీఎంసీకి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. 42 లోక్‌స్థానాలకు గాను టీఎంసీ 22 సీట్లు గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో 2 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 సీట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్..ఈసారి 22 స్థానాలక పడిపోవడంతో మమత బెనర్జీలో ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని గ్రహించిన బెంగాల్ సీఎం..2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.
ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికొస్తే.. తొలిసారిగా 2011లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. నరేంద్ర మోదీ మళ్లీ సీఎం కావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వ విజయంలోనూ పీకేకు భాగస్వామ్యముంది. దాంతో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగింది. 2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పనిచేసి సక్సెస్ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉండి..కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com