కాంగ్రెస్‌కి మరో ఎమ్మెల్యే గుడ్‌బై?.. విలీనం దిశగా..

కాంగ్రెస్‌కి మరో ఎమ్మెల్యే గుడ్‌బై?.. విలీనం దిశగా..

తెలంగాణలో కాంగ్రెస్‌కి మరో ఘోర అవమానం ఎదురవబోతున్నట్టే కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీ TRSలో జాతీయ పార్టీ కాంగ్రెస్ విలీనం తప్పదంటూ ఊహాగానాలు వస్తున్నాయి. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. హుజూర్‌నగర్ MLA పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున 19 మంది గెలిచారు. వీరిలో 11 మంది ఇప్పటికే గులాబీ కండువా కప్పేసుకున్నారు. తాజాగా మరో MLA కూడా అధికార పార్టీతో టచ్‌లోకి వెళ్లడం కలకలం రేపుతోంది.

ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో ప్రస్తుతం కాంగ్రెస్ MLAల సంఖ్య 18 అవుతుంది. మూడింట రెండొంతుల మెజార్టీ ఉంటే.. విలీనానికి అవకాశం ఉంటుందని కాబట్టి మరో ఎమ్మెల్యేని తమవైపు లాక్కోగలిగితే కాంగ్రెస్ పని ఖతమైనట్టే లెక్క. అసెంబ్లీలో విపక్ష హోదా కోల్పోవడమే కాదు.. TRSLPలో CLP విలీనం అనే గడ్డు పరిస్థితి కూడా తప్పదు. ఇవన్నీ లెక్కలేసుకున్న PCC ముఖ్యనేతలు అప్రమత్తమయ్యారు. ఏ క్షణాన ఏమవుతుందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభాపక్షంలో మిగిలింది.. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పైలెట్ రోహిత్‌రెడ్డి, పొడెం వీరయ్య మాత్రమే. వీళ్లలో కారు పార్టీతో టచ్‌లో ఉన్నది తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డేనని చెప్తున్నారు. ఒకసారి CMO నుంచి ఫోన్ వస్తే మరుక్షణం ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

గత శాసనసభలోనూ అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీల విలీనాలు చూశాం. తెలుగుదేశం, వైసీపీలు.. TRSLPలో విలీనం అయ్యాయి. ఇప్పుడీ పరిస్థితి ఏకంగా కాంగ్రెస్‌కే ఎదురవుతుండడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం తర్వాత MLAలు వరుసగా కారెక్కేశారు. ఆత్రం సక్కు, రేగ కాంతారావుతో మొదలైన వలసల పరంపర.. తర్వాత కూడా కొనసాగుతూనే వచ్చింది. హరిప్రియ నాయక్‌, హర్షవర్థన్, సురేందర్, వనమా ఇలా ఒక్కొక్కరూ కాంగ్రెస్‌కి హ్యాండిచ్చారు. హార్డ్‌కోర్ కాంగ్రెస్ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఇలా అంతా TRSలో చేరిపోయారు. ఇప్పుడు పైలెట్ రోహిత్ రెడ్డి కూడా గుడ్‌బై చెప్తే.. కాంగ్రెస్‌లో మరో సంక్షోభం తప్పదు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సన్నిహితుడిగా పేరున్న పైలెట్ రోహిత్‌రెడ్డి.. ఇప్పుడేం చేస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story