కేసీఆర్ కీలక నిర్ణయం..త్వరలోనే..

హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేశాయ్. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌కి ఆనుకుని ఉన్న సచివాలయం అంతా ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ సర్కారుదే. ఈ అప్పగింత పూర్తవడం ఆలస్యం.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి. బైసన్‌పోలో మైదానం అప్పగింతకు కేంద్రం సానుకూలంగా లేనందున.. హుస్సేన్‌ సాగర్ తీరంలో ప్రస్తుతమున్న చోటే కొత్త సెక్రటేరియట్‌ నిర్మించాలని నిర్ణయించారు. KCR-జగన్‌ల మధ్య భవనాల అప్పగింతపై చర్చలు జరిగి.. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న వెంటనే కొత్త సచివాలయ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి.

సచివాలయం అంటే కేవలం భవనాలు అన్నట్టుగా కాకుండా తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఆధునికంగా ఉండాలని KCR అంటున్నారు. ఇందుకోసం గతంలోనే ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌కు డిజైన్‌ రూపకల్పన బాధ్యతను అప్పగించారు. 2 ప్లాన్‌లు కూడా సిద్ధం అయ్యాయి. వాటికి స్వల్ప మార్పులు కూడా సూచించారు. వీటిల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒకటి ఫైనల్ చేసి.. త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు KCR. మొత్తం 4 నుంచి 5 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా కొత్త సచివాలయానికి డిజైన్లను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 10 నుంచి 12 అంతస్తులతో నిర్మించే సచివాలయం ఉండే డిజైన్‌కే ముఖ్యమంత్రి మొగ్గుచూపే అవకాశం ఉంది.

నూతన సచివాలయం నిర్మాణం కోసం.. ముందుగా కొన్ని భవనాలను కూల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా బిల్డింగుల్లో ఉన్న మంత్రులు, అధికారుల కార్యాలయాలను మరో చోటికి తరలించాల్సి వస్తుంది. ప్రస్తుతం AP బిల్డింగ్ అన్నీ తెలంగాణకు అందుబాటులోకి వస్తున్నందున.. వాటిల్లోని H, J, K, L బ్లాక్‌లకు తెలంగాణ అవసరాల కోసం వాడుకుంటారు. ఆ వెంటనే ఖాళీ అయిన A, B, C, D బ్లాకులను కూల్చివేసి.. అక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తారు. కొత్తగా కట్టే సెక్రటేరియెట్‌లో.. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధమవుతోంది.

2014లో ముఖ్యమంత్రిగా KCR బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రయత్నాలు చేశారు. ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి స్థలం తీసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ పక్కనే ఉన్న బైసన్‌పోలో గ్రౌండ్‌లో సచివాలయం కట్టాలనుకున్నారు. రక్షణ శాఖ అనుమతుల విషయంలో ఏళ్ల తరబడి చర్చలు జరుగుతున్నా కొలిక్కి రాకపోవడంతో.. అది కూడా పక్కకు వెళ్లింది. ఓ దశలో కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైనా.. కొన్ని అభ్యంతరాల కారణంగా స్తలం అప్పగింత జరగలేదు. చివరికి ఇప్పుడు ఏపీ భవనాలన్నీ అప్పగిస్తుండడంతో.. ఉన్నచోటునే అత్యాధునికంగా సచివాలయం కట్టేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత సచివాలయ సముదాయం 24 ఎకరాల్లో ఉంది. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్‌కు అనుగుణంగా ఇప్పుడు ఈ స్థలాన్ని వాడుకునే విషయంలో కొన్ని మార్పులు జరగనున్నాయి. రోడ్ల, పార్కింగ్ సౌకర్యాలు వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ పనులు చేపడతారు.

Tags

Read MoreRead Less
Next Story