ఆయన ఎంట్రీతో వరల్డ్‌కప్‌లో మారిన సీన్!
ప్రపంచకప్ జోష్ క్రమంగా ఊపందుకుంటోంది. తొలి వారం చప్పగా సాగిన మ్యాచ్‌లో నిరాశపడిన అభిమానులకు టీమిండియా ఎంట్రీతో ఉత్సాహం వచ్చింది. తాజాగా కివీస్‌ను బంగ్లా, ఆసీస్‌ను విండీస్ వణికించడంతో అభిమానులు క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ తొలి వారం మ్యాచ్‌ల ఆశించిన స్థాయిలో ఆసక్తికరంగా జరగలేదనే చెప్పాలి. చాలా వరకూ వన్‌సైడ్ పోరుతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి తోడు టీమిండియా ఫస్ట్ మ్యాచ్ కూడా వారం తర్వాత ఉండడంతో పెద్దగా జోష్ కనిపించ లేదు. అయితే కోహ్లీసేన ఎంట్రీతో వరల్డ్‌కప్‌లో సీన్ మారింది. సౌతాఫ్రికాపై అదిరిపోయే ప్రదర్శన చేసిన భారత్ టోర్నీకి ఊపు తెచ్చింది. ఇక టీమిండియా ఆడబోయే తర్వాతి మూడు మ్యాచ్‌లు కూడా టఫ్ టీమ్స్‌తోనే కావడంతో మరింత రసవత్తర సమరాలు అభిమానులు చూడబోతున్నారు.
నిజానికి ఈ ప్రపంచకప్‌లో తొలి వారం చాలా చప్పగా సాగిందనే చెప్పాలి. ఆతిథ్య ఇంగ్లాండ్ మ్యాచ్‌లపై తప్పిస్తే... మిగిలిన మ్యాచ్‌లపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలా వరకూ వన్‌సైడ్ రిజల్ట్స్‌తో వారికి నిరాశే కలిగింది. అయితే రెండో వారం టీమిండియా ఎంట్రీతో పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. అటు మిగిలిన మ్యాచ్‌లు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. సౌతాఫ్రికాకు బంగ్లాదేశ్ షాకివ్వడంతో వరల్డ్‌కప్‌కు ఊపొచ్చింది. తర్వాత సంచలనాలు నమోదు కాకున్నా... కొన్ని మ్యాచ్‌లు నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ , న్యూజిలాండ్‌ను వణికించింది. చిన్న స్కోర్‌నే కాపాడుకునేందుకు చివరి వరకూ పోరాడినా... కివీస్ అనుభవం ముందు తలవంచక తప్పలేదు.
అటు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఉన్న ఆసీస్‌ను వెస్టిండీస్ కంగారెత్తించింది. ఆ జట్టు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒక దశలో ఆసీస్ 100 కూడా స్కోర్ చేయకుండానే సగం వికెట్లు చేజార్చుకుంది. స్మిత్,కౌల్టర్‌నైల్ ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ఆదుకోకుంటే ఆసీస్‌కు షాక్ తగిలేది. ఛేజింగ్‌లోనూ విండీస్ చివరి వరకూ పోరాడినా... ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో విజయం ముంగిట చతికిలపడింది.మొత్తం మీద తొలివారం వన్‌సైడ్ మ్యాచ్‌లతో నిరాశపడిన ఫ్యాన్స్‌కు రెండో వారం వరల్డ్‌కప్ అలరిస్తోంది. పెద్ద జట్లకు చిన్న జట్లు గట్టిపోటీనిస్తుండడంతో... సంచలనాలను పక్కన పెడితే... అభిమానులు అసలైన క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు. రానున్న రెండు వారాల్లో ఇదే జోరు కొనసాగితే కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశముంది. దీంతో టైటిల్ రేసులో ఉన్న జట్లు అప్రమత్తంగా ఆడకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే.
- నరేష్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com