పెళ్లైన ఏడాదికే..

విధి ఎంత విచిత్రమైంది. భర్త విమానం నడిపే పైలెట్. భార్య ఆ విమానానికి డైరక్షన్లు ఇచ్చే ఉద్యోగిని. ఏటీసీగా విధులు నిర్వహిస్తోంది. పెళ్లైన ఏడాదికే ఆయన నడుపుతున్న విమానం అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం.. అందుకు భార్య ప్రత్యక్ష సాక్షి కావడం విధి ఆడిన వింత నాటకం. భార్యా భర్తలు ఒకే ఆఫీసులో పనిచేస్తే ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. కలిసి వెళ్లొచ్చు కలిసి రావొచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సోమవారం భారత్,చైనా సరిహద్దుల్లో ఆచూకీ తెలియకుండా పోయిన ఏఎన్-32 విమానం పైలెట్ ఆశిష్ తన్వర్ కాగా ఆయన భార్య సంధ్యా తన్వర్ ఆరోజు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విధుల్లో ఉన్నారు.
మధ్యాహ్నం 12.27 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి ఏఎన్-32 విమానం 12 మందితో బయలుదేరింది. విమానం బయలు దేరిన కొద్దిసేపటికే కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ విషయాన్ని అందరికంటే ముందుగా సంధ్యనే గుర్తించారు. కాగా, ఆశిష్ తన్వర్, సంధ్య వివాహం 2018లో అయింది. పెళ్లైన ఏడాదికే ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సంధ్య ఉహించి ఉండరు. విమానంతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారి జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. హరియాణా రాష్ట్రం పల్వాల్‌లోని దీఘోట్ గ్రామానికి చెందిన ఆశీష్ బీటెక్ పూర్తి చేసి 2013లో భారత వాయుసేనలో చేరారు. గ్రామస్థులు తమ సమీపంలోని పర్వత ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించినట్లు అధికారులకు సమాచారం అందించడంతో విమానం జాడ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com