వైసీపీ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చ జరుగుతోంది. ఇదే సమావేశంలో మంత్రివర్గ ఏర్పాటుపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
కేబినెట్ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్..వైసీపీ శాసన సభాపక్షం భేటీలో ఆ వివరాలు ప్రకటించనున్నారు. కేబినెట్ కూర్పుకు ఏయే అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నది, ఎవరికి ఎందుకు అవకాశం ఇస్తున్నదీ ఎమ్మెల్యేలకు జగన్ వివరంగా చెప్పనున్నారు. కేబినెట్ కూర్పు విషయంలో ప్రాంతీయ, సామాజిక వర్గాల మధ్య పాటించాల్సిన సమన్యాయం, పార్టీలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే భేటీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపైనా స్పష్టత రానుంది.
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన విధంగానే మంత్రివర్గాన్ని కూడా విడతల వారీగా కాకుండా ఒకేసారి ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఒకేసారి 25 మందికి చోటు లభించే అవకాశం ఉంది. అయితే అధినేత మనసులో ఎవరున్నారో? తమకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా లేదా అన్నదానిపై ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. కొందరు పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. కేబినెట్‌లో మెజార్టీ బెర్త్‌లు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తనదైన మార్క్‌తో పాలనలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఐతే.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితోపాటు మండలి నుంచి ఎవరికైనా కేబినెట్‌లో చోటు కల్పిస్తారా లేదా అన్న దానిపై కూడా ఇవాళ స్పష్టత రానుంది.
మరోవైపు రేపు 11.49 గంటలకు సచివాలయ ప్రాంగణంలో మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సాయంత్రం విజయవాడకు చేరుకోనున్న గవర్నర్... రేపు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com