మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధం.. సీఎం జగన్..
మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. సచివాలయం ప్రాంగణంలో ఉదయం 11గంటల 49 నిమిషాలకు ప్రమాణం చేయిస్తారు గవర్నర్ నరసింహన్. ఇప్పటికే ప్రాంగణాన్ని, ప్రమాణస్వీకార వేదికను వైసీపీ జెండా రంగులతో అలంకరించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజల కోసం ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడికి చేరుకునేలా ట్రాఫిక్ డైవర్షన్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా సభా ప్రాంగణంలో... ఏసీలు, కూలర్లు అమర్చారు. ప్రత్యేక ఎల్‌ఈడీలు సైతం ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తామన్నారు డీజీపీ గౌతం సవాంగ్ . దాదాపు 6వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రామానికి 2 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.
మరోవైపు....మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే సీఎం జగన్ తొలిసారిగా సచివాలయంలోని సీఎం ఛాంబర్ కు వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల 39 నిమిషాలకు సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఉన్న తన చాంబర్‌లో ఉదయం 8 గంటల 42 నిమిషాలకు సీఎం జగన్ పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 8.50 నిమిషాలకు కీలక ఫైళ్లపై సంతకం చేయనున్నారు.
మంత్రుల ప్రమాణస్వీకార వేదిక వద్దకు వెళ్లేంతవరకు సెక్రటేరియట్‌లోనే ఉంటారు. ఉ 11 గంటల 44 నిమిషాలకు సీఎం జగన్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు చేరుకుంటారు. 11 గంటల 49 నిమిషాలకు మంత్రుల ప్రమాణస్వీకారం ప్రారంభమవుతుంది. గవర్నర్ నరసింహన్ 25 మంది మంత్రులతో ఒకేసారి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com