జగన్ విధేయుడికి మంత్రి పదవి..

ఏపీ సీంగా జగన్ ప్రమాణం తర్వాత....మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. మొత్తం 25 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ.. తొలి కేబినెట్‌ను రూపొందించారు సీఎం జగన్‌. పార్టీలో సీనియర్లు, సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రెడ్డి, కాపులకు చెరో నాలుగు మంత్రి పదవులు దక్కాయి. ఇక బీసీల్లో ఏడుగురికి మంత్రి పదవులు వరించాయి. ఐదు మందిఎస్సీలకు కేబినెట్ లో అవకాశం కల్పించగా అందులో మాల వర్గానికి మూడు మాదికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇక మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. స్పీకర్ పదవిని బీసీ వర్గానికి కేటాయించగా బ్రహ్మణ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించారు. సామాజికవర్గాలతో పాటు ప్రాంతాల వారీగా కూడా బ్యాలెన్స్ చేస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు..

తన తొలి మంత్రివర్గం జాబితాను సీఎం జగన్...గవర్నర్ నరసింహన్ కు అందించారు. గవర్నర్ ఆమోదించటంతో 25 మంది మంత్రులు ఇవాళ ఉదయం 11 గంటల 49 నిమిషాలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ ఒకే సారి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు..

జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపె విశ్వరూప్‌ ఉన్నారు. ఈ నలుగురు వైఎస్ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ధర్మాన కృష్ణదాస్‌, అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, తానేటి వనిత కేబినెట్ లో అవకాశం దక్కింది..

గుడివాడ నుంచి బలమైన నేతగా గుర్తింపు పొందిన కొడాలి నానికి తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మోపిదేవి వెంకటరమ ణకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో ఆయన్ను మండలికి పంపించనున్నట్లు క్లారిటీ ఇచ్చినట్లైంది. ఇక మేకపాటి గౌతం రెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. జగన్ విధేయుడిగా పేరున్న అనిల్ కుమార్ యాదవ్ తో పాటు నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం, శంకర్‌ నారాయణ, ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జగన్ కేబినెట్ లో సగానికిపైగా మొదటి సారిగా మంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు..

మరోవైపు.... మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే సీఎం జగన్ తొలిసారిగా సచివాలయంలోని సీఎం ఛాంబర్ కు వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల 39 నిమిషాలకు సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఉన్న తన చాంబర్‌లో ఉదయం 8 గంటల 42 నిమిషాలకు సీఎం జగన్‌ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం.. ఉదయం 8.50 నిమిషాలకు కీలక ఫైళ్లపై సంతకం చేయనున్నారు. అనంతరం మంత్రుల ప్రమాణం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తి అయ్యాయి. మరోవైపు ఇవాళ సాయంత్రం ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం అవుతుంది.

Tags

Next Story