నేడు తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ల ఎంపిక

నేడు తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ల ఎంపిక

తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ల ఎంపికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి, అర్హత సాధించినవారి పేర్లు ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువు ఇస్తారు. ఆ తర్వాత ఎన్నిక ప్రక్రియను చేపడుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా పరిషత్ మొదట కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.

ఇప్పటికే 32 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీచేశారు. జిల్లాల పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులను ప్రత్యేక సమావేశానికి రావాలని నోటీసు ద్వారా సమాచారం అందించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌ల ఎన్నికలో రిజర్వేషన్ల ప్రకారం 32 జిల్లాల్లో మహిళలకు 50 శాతం కోటా కింద 16 స్థానాలు దక్కుతున్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడంతో కొత్తగా రిజర్వేషన్లు వచ్చాయి. ఈ టర్మ్‌తోపాటు వచ్చే టర్మ్‌కు కూడా ఇవే రిజర్వేషన్లు వర్తించనున్నాయి. వీటి ప్రకారం జెడ్పీ చైర్మన్లలో ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు ఆరు, బీసీలకు ఆరు స్థానాలు దక్కాయి.

‌‌ప్రతి జిల్లాలోనూ మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఈనేపథ్యంలో జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ లాంఛనం కానున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి.. అన్ని పార్టీలు తమ అభ్యర్థులకు విప్‌ను జారీ చేశాయి.

Tags

Next Story