ఆర్టీసీ కార్మికులకు శుభవార్త వినిపించిన జగన్‌ ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికులకు శుభవార్త వినిపించిన జగన్‌ ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికులకు గుడ్‌ న్యూస్‌ అందించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభింస్తామని ప్రకటించింది... ఇందుకోసం త్వరలో ఓ కమిటీని వేయనున్నట్టు కార్మిక సంఘాలకు రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు.

ఏపీ ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది... ప్రభుత్వ ప్రగతి చక్రంగా భావించే ఆర్టీసీకి రాబోయేవి ఇక మంచి రోజులేననే సంకేతాలు కనిపిస్తున్నాయి... పీకల్లోతు అప్పులతోపాటు.. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విలీన ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది... సమ్మెకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న కార్మికులకు ఇది ఊహించని పరిణామం.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు ఈనెల 13 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి.. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలతో రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు చర్చలు జరిపారు.... ఎంప్లాయిస్ యూనియన్ సహా ఇతర సంఘాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆర్టీసీని ఆదుకోవాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని, దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని కృష్ణబాబు వారికి స్పష్టం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు త్వరలో ఓ కమిటీని వేయనున్నారు. మూడు రోజుల్లో ఆ కమిటీ ఏర్పాటు అవుతుందని కృష్ణబాబు తెలిపారు... ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు కార్మిక సంఘాల వారికి కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు కార్గో వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ లభించినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయితే, NGOల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి. రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 సంవత్సరాలకు పెరుగుతుంది. పెన్షన్, ఇళ్ల స్థలాలు, రిటైర్ అయిన ఉద్యోగులకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్ విషయంపై సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఈనెల 10న సీఎం జగన్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ కలవనుంది.ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్‌గా నడుస్తోంది. ఈ సంస్ధ మీద 9వేల ఆరు వంద కోట్ల అప్పులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆరువందల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆర్టీసీలో మొత్తం 53,000 మంది ఉద్యోగులు, కార్మికులు సేవలు అందిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Next Story