వినిపించిన రుతురాగం.. కురిసిన తొలకరి జల్లు
రుతురాగం వినిపించింది. తొలకరి జల్లు కురిసింది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేళకు దేశంలో ప్రవేశించాయి. వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. భారత వాతావరణ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మాల్దీవులు, కోమోరిన్, దక్షిణ తమిళనాడు, దక్షిణ అరే బియా సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఉపరితల ఆవ ర్తనం ఏర్పడింది.
రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 9న కొల్లాం, అలప్పుజ జిల్లాలు, జూన్ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. అరేబియా సముద్రం అల్లకల్లో లంగా మారుతుం దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఐఎండీ హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మలబారుతీరాన్ని ముద్దాడిన రుతుపవనాలు, మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించనున్న రుతుపవనా లు, ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభా వం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. శుక్ర-శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు పడ్డాయి. ఆది, సోమవారాల్లోను మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. దాదాపు నాలుగు నెలల పాటు రుతుపవనాల ప్రభావం ఉంటుంది. తొలకరి జల్లు పలకరింపుతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్ సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com