మంత్రి వర్గ విస్తరణతో సంకీర్ణంలో చిచ్చు చల్లారుతుందా?

మంత్రి వర్గ విస్తరణతో సంకీర్ణంలో చిచ్చు చల్లారుతుందా?
X

మంత్రి వర్గ విస్తరణతో సంకీర్ణంలో చిచ్చు చల్లారుతుందా? కేబినెట్‌ విస్తరణతో సీనియర్లు దారికొస్తారా? మరోవైపు ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఆపరేషన్‌ కమల అస్త్రాన్ని.. బీజేపీ మరోసారి ప్రయోగించబోతోందా? వచ్చే రోజుల్లో కన్నడ రాజకీయం ఎలా ఉండబోతోంది.

కూటమిలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ మంత్రి రామలింగారెడ్డి... గత కొన్ని రోజులుగా సిద్ధ రామయ్యపై అలక బూనారు. తనను కేబినెట్‌లో తీసుకోకపోవడంపై ముందు నుంచి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాపాడుకునేందుకు జేడీఎస్‌ మంత్రులు రాజీనామాకు సిద్ధమవుతున్నా.. కాంగ్రెస్‌ వారిని సంతృప్తి పరచడం మాత్రం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి అసంతృప్తిని చల్లార్చాలని సిద్ధా రామయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓవైపు కూటమిలో సంక్షోభం ముదరడంతో..ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ.. మళ్లీ ఆపరేషన్‌ కమలను చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆపరేషన్‌ కొనసాగించిన బీజేపీ...సార్వత్రిక ఎన్నికల సమయంలో మౌనంగా ఉండిపోయింది. కారణం.. ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో ఎన్నికలు ముగిసే వరకు సైలెంట్‌గా ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలో కాషాయ దళం క్లీన్‌ స్వీప్‌ చేసింది. 28 స్థానాలకుగాను 25 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. దీంతో మరోసారి ఆపరేషన్‌ కమలపై గురి పెట్టింది బీజేపీ. మళ్లీ రీ యాక్టివేట్ కావడంతో కూటమిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్కడ ఎమ్మెల్యేలు చేజారుతారేమో అన్న భయం సంకీర్ణ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.

ఇప్పటి వరకు సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్తారని ప్రచారం సాగినా.. కేవలం చించోళి ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ మాత్రమే వెళ్లారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 113 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ప్రస్తుతం JDS 37, కాంగ్రెస్ 79 కలిపి 116 మంది ఉన్నారు. ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండడంతో ఆసంఖ్య 118 మందికి చేరుకుంటుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారని ఆ పార్టీలు చెబుతున్నారు. ఇదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశం ఉంది దీంతో కాంగ్రెస్‌ జేడీఎస్‌ పెద్దలు అలర్ట్‌ అయ్యారు. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, సీఎం కుమారస్వామితో సిద్ధరామయ్య వరుస భేటీలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్‌ కమలకు చెక్‌ పెట్టాలని భావిస్తున్న కూటమి నేతలు..మంత్రి వర్గ విస్తరణను తెరపైకి తెచ్చారు.

ఈ నెల 12న ఎంత మందికి మంత్రి వర్గంలో చోటు దక్కనుంది? సంకీర్ణంలో సంక్షోభం నివారణకు మంత్రి వర్గ విస్తరణ ఫలిస్తుందా? కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్‌ సీనియర్లు బీజేపీవైపు చూస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మరీ రాబోయే రోజుల్లో కన్నడ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందనేది కాలమే నిర్ణయించాలి.

Tags

Next Story