ఆ సమయం ఇదే.. యువరాజ్ భావోద్వేగం..

టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మేట్ల నుండి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. 17 ఏళ్ళ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఇదేనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన యువరాజ్ జాతీయ జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. 2007 టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్లో యువీ కొట్టిన ఆరు సిక్సర్ల ఫీట్‌ను అభిమానులు ఎప్పటకీ మరిచిపోలేరు.అలాగే 2011 ప్రపంచకప్ విజయంలోనూ ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ కీలకపాత్ర పోషించాడు. ఇప్పటి వరకూ 40 టెస్టులు, 304 వన్డేలు ఆడిన యువీ..పరిమిత ఓవర్ల ఫార్మేట్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు సాధించాడు. రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించేటప్పుడు యువీ కంటతడి పెట్టాడు.
యువీ కెరీర్‌ను 2011 ముందు , 2011 తర్వాతగా చెప్పొచ్చు. 2011 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌కు ఈసమయంలోనే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి సోకింది. ప్రపంచకప్ తర్వాత చికిత్స కోసం అమెరికా వెళ్ళిన యువీ... క్యాన్సర్‌ను జయించాడు. క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే రీ ఎంట్రీలో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోవడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్లో అప్పుడప్పుడు అలరించినా... ఈ ఏడాది వేలంలో అతన్ని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో ముంబైఇండియన్స్ యువీని కొనుక్కుంది. జాతీయ జట్టులో మళ్ళీ చోటు దక్కే అవకాశాలు లేకపోవడంతో యువీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని బీసిసిఐని కోరినా... బోర్డు సానుకూలంగా స్పందించకపోవడంతో నిరాశే మిగిలింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com