క్షీణిస్తున్న భట్టి ఆరోగ్యం

క్షీణిస్తున్న భట్టి ఆరోగ్యం

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్క ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోంది. షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాత్రి పదకొండున్నర వరకే నిరసన దీక్షకు అనుమతి ఉండడంతో.. భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ భట్టి మాత్రం తాను దీక్ష కొనసాగిస్తానని భీష్మించారు. దీంతో ఏక్షణాన్నైనా పోలీసులు దీక్ష భగ్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..

దీక్షకు పెద్ద సంఖ్యలో నాయకులు సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్‌ ఫిరాయింపు రాజకీయాలపై ఫోకస్‌ చేస్తున్నారే తప్ప.. పాలన మీద కాదని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సీఎల్పీని విలీనం చేసుకున్నామని కేసీఆర్‌ సంబరపడుతున్నా.. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. స్పీకర్‌ వైఖరిపైనా శ్రీధర్‌బాబు విమర్శలు చేశారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలను వినని స్పీకర్, 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో విలీనం చేసినందుకు సిగ్గు పడాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌కు 12 మంది ఎమ్మెల్యేలే మిగులుతారని జోస్యం చెప్పారు. సీఎల్పీ విలీనం నిబంధనల ప్రకారమే జరిగిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్‌ని కేటీఆర్ సంప్రదించాలన్నారు. విలీన అంశం స్పీకర్ పరిధిలోనిది కాదని, అసలు ఆ అధికారం స్పీకర్‌కు లేదన్న రేవంత్.. పార్టీని వీడుతున్నట్టు లేఖలు విడుదల చేసిన ఎమ్మెల్యేలు, అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎలా సమావేశం నిర్వహిస్తారని నిలదీశారు.

Tags

Next Story