చదివేది ఇంజినీరింగ్.. కానీ వారు చేసేది మాత్రం..

చదివేది ఇంజినీరింగ్.. కానీ వారు చేసేది మాత్రం..

వారంతా భావి ఇంజినీర్లు... చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు. అలాంటి విద్యార్థులు పెడదారి పట్టారు. సహచర విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. విజయవాడలో సాగుతున్న గంజాయి దందా కలకలం సృష్టిస్తోంది.

విజయవాడ ఆంధ్రప్రదేశ్‌కు రాజకీయ రాజధానే కాకుండా... విద్యా రాజధాని కూడా. వేలాది విద్యా సంస్థలు ఇక్కడున్నాయి. ఎన్నో ఇంజినీరింగ్‌ కాలేజీలు భావిభారత ఇంజినీర్లను దేశానికి అందిస్తున్నాయి. అయితే విజయవాడలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో మత్తుపదార్థాలు నవభారత నిర్మాణానికి ఉపయోగపడే విద్యార్థులను చిత్తుచేస్తున్నాయి. వారి శరీరాన్నే కాదు.. జీవితాన్ని నాశనం చేస్తున్నాయి.

విజయవాడ గంజాయి అమ్మకాలపై పోలీసులు దృష్టిపెట్టగా కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పలువురు బీటెక్‌ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మారినట్టు వారి తనిఖీల్లో బయటపడింది. తమకు పట్టుబడ్డ ఒక బీటెక్‌ విద్యార్థిని విచారించగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. ఆ విద్యార్థి చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్‌ తిన్నారు. విశాఖ జిల్లా నుంచి 2 నుంచి 4 కిలోల గంజాయి తీసుకోచ్చి వాటిని ప్యాకెట్లుగా మార్చి కాలేజీల్లో అమ్ముతున్నట్టు ఆ విద్యార్థి పోలీసుల విచారణలో చెప్పాడు.

గంజాయి అమ్మకాలతో సంబంధం ఉన్న పదిమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఆరుగురు బీటెక్‌ విద్యార్థులు ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. అరకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా గంజాయి కొనుగోలు చేస్తున్న బీటెక్‌ విద్యార్థులు.. పోలీసుల కన్నుగప్పి విజయవాడకు తీసుకొచ్చి, వివిధ కాలేజీల్లో చదువుతున్న తమ స్నేహితులకు విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఐదు కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజ్‌ల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

కొందరు విద్యార్థులు గంజాయి అమ్ముతున్నట్టు పోలీసులు నాలుగు నెలల కిందటే గుర్తించారు. అప్పుడు పట్టుబడ్డ నలుగురికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చక్కగా చదువుకోవాలని, తప్పుదోవ పట్టి కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. అయినా విద్యార్థుల తీరు మారలేదు. ఎప్పటిలాగే కాలేజీల్లో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. పోలీసులు తమకు పట్టుబడ్డ ఆరుగురు బీటెక్ విద్యార్థులను విచారిస్తున్నారు. గంజాయి అమ్మేవారితో వారికి ఉన్న సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story