మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇవ్వాల్సిన చెక్కులు మాయం

మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇవ్వాల్సిన చెక్కులు మాయం కలకలం రేపుతోంది. భూ నిర్వాసితులకు పంపిణీ చేయాల్సిన చెక్కుల్లో రెండు చెక్కులు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆర్డీవో ఆఫీస్ కేంద్రంగా ఈ బాగోతం బయట పడింది. ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సందీప్ వీటిని మాయం చేసినట్లు అధికారుల విచారణలో తేలడంతో..జిల్లా కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేశాడు.
సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం.. స్థానికంగా ఉన్న ఆరు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఇందులో భాగంగా భూసేకరణ చేపట్టిన అధికారులు.. పరిహారం కింద నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పంపిణీ చేయాల్సిన అధికారులు..చెక్కులు మాయం చేశారు. భూ పరిహారాన్ని నొక్కే ప్రయత్నం చేశారు. చెక్కులను కొండపాక మండలం దుద్దెడకు చెందిన చాంద్‌పాషా అనే వ్యక్తికి ఉద్యోగి సందీప్ ఇవ్వగా.. చాంద్‌పాషా దుద్దెడలోని ఓ బ్యాంకులో జనవరి నెలాఖరున 50 లక్షలను డ్రా చేశాడు. ఏప్రిల్‌లో మరో చెక్కు ద్వారా 2 కోట్ల 60లక్షలను డ్రా చేయడానికి ప్రయత్నించగా బ్యాంకులో నగదు లేకపోవడంతో ఆగిపోయాడు. ఈ క్రమంలో అక్రమాన్ని ఆలస్యంగా గుర్తించి రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేయడంతో... అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సీనియర్ అసిస్టెంట్ సందీప్ ఈ చెక్కులను మాయం చేసినట్లు నిర్ధారించారు.
నిందితులను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగగానే చాంద్ పాషా పరారయ్యాడు. దుబాయ్‌కు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అధికారుల వద్ద ఉండాల్సిన చెక్కులు ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి వద్దకు ఎలా వచ్చాయన్నది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సదరు ఉద్యోగి ఒక్కడే మాయం చేశాడా? దీనికి మరెవరైనా సహకరించారా? అన్నది తేలాల్సి ఉంది. చెక్కులు మాయమై ఆరు నెలలు గడిచిన దీన్ని గుర్తించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. చెక్కుల మాయం వెనుక సందీప్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

