పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు మధ్య వివాదం
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇద్దరి మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. అమరీందర్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న సిద్ధూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకావాద్రాలను కలిశారు. అగ్ర నాయకుడు అహ్మద్ పటేల్‌తో కూడా భేటీ ఆయ్యారు. పంజాబ్‌లో పరిస్థితులు, ఇటీవలి పరిణామాలను వారికి వివరించారు. హస్తం పార్టీలో కొందరు చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని రాహుల్, ప్రియాంకలకు తెలిపారు. కీలకమైన బాధ్యతల నుంచి తప్పించడం తనకు అవమానకరమన్న సిద్ధూ, మంత్రి పదవికి రాజీనామా చేస్తా నని చెప్పినట్లు సమాచారం. ఐతే, సిద్దూకు నచ్చచెప్పిన రాహుల్, పార్టీలో మరింత ప్రాధాన్యం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల అమరీందర్, సిద్ధూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మంత్రి సిద్ధు ఇది వరకు స్థానిక సంస్థల శాఖ, టూరిజం, సాంస్కృతిక శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ రాగా...ఈ బాధ్యతల నుంచి తప్పించి కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితం చేశారు అమరీందర్ సింగ్. దీంతో అమరీందర్ సింగ్ నిర్ణయం పట్ల సిద్ధు గుర్రుగా ఉన్నారు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించకపోవడానికి స్థానిక సంస్థల శాఖ మంత్రి సిద్ధూ వైఫల్యమే కారణమని అమరీందర్ సింగ్ ఇటీవల ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిద్ధూ తోసిపుచ్చారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సిద్ధూ పాల్గొననాటి నుంచే ఆయనకు, అమరీందర్ సింగ్‌కు మధ్య వివాదం నడుస్తోంది. అమృత్‌సర్ లోక్‌సభ టిక్కెట్ తనకు దక్కకపోవడం వెనుక సీఎం అమరీందర్ సింగ్ ప్రమేయం ఉందని సిద్ధూ సతీమణి నవ్‌జ్యోత్ కౌర్ ఇటీవల బహిరంగ విమర్శలు చేశారు. కౌర్‌కు టికెట్ రాకపోవడానికి అమరీందరే కారణమన్నది సిద్దూ ఆరోపణ.
ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టాం .. అంతర్గత విభేదాలతో పలురాష్ట్రాల్లో నేతల పంచాయితీలను ఏమేరకు చల్లార్చుతుందో చాడాలి మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com