రోజుకు 60 మంది...వారిలో 18 నుంచి 40 ఏళ్ల వయసువారే..

రోజుకు 60 మంది...వారిలో 18 నుంచి 40 ఏళ్ల వయసువారే..

పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే నిరాశ.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోతే అగాధంలోకి వెళ్లిపోయిన ఆవేదన.. కనిపెంచిన బిడ్డలే తమను పట్టించుకోవడం లేదన్న బాధ.. కారణమేదైతేనేం. ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత ఏమవుతున్నారో రోజులు, నెలలు, ఏళ్లు గడిచినా ఆచూకీ దొరకడం లేదు. పోలీస్ స్టేషన్లలో కేసులు అంతకంతకూ పేరుకుపోతున్నా మిస్సింగ్ మిస్టరీలు మాత్రం కొలిక్కిరావడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ కేవలం 9 రోజుల్లోనే 545 మిస్సింగ్ కేసులు నమోదవడం సంచలనంగా మారింది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకూ ఈ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో సగానికిపైగా హైదరాబాద్ చుట్టుపక్కలే జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 296 కేసులు నమోదు చేశారు.

ఇంట్లో నుంచి కావాలని వెళ్లిపోతున్న వాళ్లు కొందరైతే.. చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. అదృశ్యమైన వాళ్లు ఏ ముఠాల చేతికి చిక్కారో తెలియడం లేదు. మనుషుల అక్రమ రవాణా చేసే ముఠాలు.. అవయవాలు అమ్ముకునే ముఠాలు గల్లీకి ఒకటి మాటేసి ఉన్న ఈ పరిస్థితుల్లో తమ వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది మిస్సింగ్ కేసులు తీసుకుంటే.. సరాసరిన రోజుకు 40 నుంచి 45 మంది కనిపించకుండా పోతున్నారు. ఈ నెలలో ఇది ఏకంగా 60కి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

పసిపిల్లలు, యువత, వృద్ధులు ఏమవుతున్నారు..? మిస్సింగ్ కేసుల పరిష్కారంపై పోలీసులు దృష్టి పెట్టడం లేదా? పీఎస్‌లో కేసులే ఇన్ని ఉంటే దృష్టికి రానివి ఇంకెన్ని? ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సమన్వయ లేమితోపాటు, రోజువారీ కేసులతోనే వారికి సమయం సరిపోతుంది. మిస్సింగ్ కేసులను ఒకట్రెండు రోజులు ఫాలోఅప్ చేసినా.. ఆ తర్వాత వాటిని పక్కకు పెట్టేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు స్టేషన్ల చుట్టూ తిరిగినా వారికి ఎలాంటి అదనపు సమాచారం దొరకడం లేదు. టెక్నాలజీ సాయంతో కేసుల్ని ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటోంది.

పోలీసు రికార్డుల ప్రకారం మిస్సింగ్ కేసులు పరీక్షల ఫలితాల సమయంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా పారిపోతున్న విద్యార్థులు వారం పదిరోజుల తర్వాత తిరిగి వస్తున్నారు. దాదాపు 90 శాతం కేసుల్లో ఇలా ఉంటే.. 10 శాతం మంది ఏమయ్యారో ఆచూకీ తెలియడం లేదు. ఇక.. ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోరన్న కారణంతో లేచిపోతున్న వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. రెండు కుటుంబాల్లో అలజడి చల్లారే వరకూ వీరు అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాతే కుటుంబ సభ్యులకు టచ్‌లోకి వస్తున్నారు. ఈ మధ్య ఈ తరహా కేసులు కూడా పెరిగాయి. ఇక..వృద్ధాప్యంలో ఉన్న వారు.. అంటే 80 ఏళ్ల వయసు వారు కూడా అయిన వాళ్లకు దూరంగా వెళ్లిపోవడం పెరిగింది. ఇలాంటి మిస్సింగ్ కేసులు కూడా తేలపోవడంతో.. బంధువుల్లో ఆందోళన నెలకొంటోంది. హజీపూర్‌లో అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపిన శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసులపై సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే ఇలాంటి దురాగతాలకు కొందరు బలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. రోజురోజుగూ పెరుగుతున్న మిస్సింగ్ కేసులు మాత్రం పోలీస్ శాఖ పనితీరుకు సవాల్‌గా మారుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story