తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

టిఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ పోరు ఉదృతం చేసింది. ప్రజాస్వామ్య ప‌రిర‌క్షణ పేరుతో సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి చేప‌ట్టిన నిరాహార దీక్షను పోలీసులు భ‌గ్నం చేయ‌డంతో భ‌గ్గుమ‌న్న హ‌స్తం నేత‌లు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు పిలుపు నిచ్చారు. ఓవైపు న్యాయ పోరాటానికి క‌స‌ర‌త్తు చేస్తూనే.. రాష్ట్రప‌తిని కలిసేందుకు కార్యాచ‌ర‌ణ ప్రక‌టించారు.

తెలంగాణ‌లో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడం.. అధికార -విపక్షాల మధ్య పొలిటిక‌ల్ వార్‌కు దారితీసింది. స్పీక‌ర్ నిర్ణయంపై భగ్గుమంటున్న హ‌స్తం నేత‌లు.. సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క చేప‌ట్టిన 36 గంట‌ల నిర‌స‌న దీక్షను నిర‌వ‌దిక దీక్షగా ప్ర‌క‌టించారు. ఈ దీక్షను పోలీసులు భ‌గ్నం చేశారు. ఇందిరాపార్కు దీక్షస్థ‌లం నుంచి ఆయ‌న్ను అరెస్ట్ చేసి నిమ్స్ హ‌స్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అప్పటికే ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా నీర‌సించిపోయింది. షుగ‌ర్.. బీపీ లెవ‌ల్స్ పూర్తిగా ప‌డిపోవ‌డంతో డాక్టర్లు ఆయ‌న‌కు సెలైన్‌ ఎక్కించేందుకు ప్రయ‌త్నించారు. కానీ భ‌ట్టి వైద్యానికి నిరాక‌రించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ప్రమాదంలో ఉంద‌ని దీని కోసం తాను దీక్ష కొన‌సాగిస్తాన‌ని ఆయ‌న ప్రక‌టించారు.

భ‌ట్టి వైద్యానికి నిరాక‌రించ‌డంతో రంగంలోకి దిగిన పార్టీ ముఖ్యనేత‌లు.. ఆయ‌నకు న‌చ్చజెప్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఏఐసీసీ కార్యద‌ర్శులు.. పిసీసీ చీఫ్ ఉత్తమ్‌లు అధిష్టానంతో భ‌ట్టికి ఫోన్‌లో మాట్లాడించి నిమ్స్‌లో భట్టికి నిమ్మర‌సం ఇచ్చి దీక్ష విర‌మింప‌జేశారు. కేసీఆర్ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన ఉత్తమ్‌ ఇవాళ... రాష్ట్రవ్యాప్త ఆందోళ‌న‌ల‌కు పిలుపు నిచ్చారు.

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌ను దేశ‌వ్యాప్త చ‌ర్చకు తీసుకెళ్ళేందుకు నిర్ణయించారు కాంగ్రెస్ నేత‌లు. అన్ని రాజ‌కీయ పార్టీల అధినేత‌ల‌ను క‌లిసి ఈ అంశాన్నివివ‌రించాల‌ని నిర్ణయించారు. ఇప్పటికే న్యాయ పోరాటానికి క‌స‌ర‌త్తు చేస్తున్న హ‌స్తం నేత‌లు.. రాష్ట్రప‌తిని క‌లిసి ఫిర్యాదు చేసేందుకు ప్లాన్ చేస్తుంది.

నిమ్స్‌లో మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కను జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రామ్.. సీపీఐ రాష్ట్ర కార్యద‌ర్శి చాడా వెంక‌ట్ రెడ్డి.. మంద‌కృష్ణ.. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్.. రాజ్యస‌భ స‌భ్యడు కేవీపీ రాంచంద‌ర్ రావులు ప‌రామ‌ర్శించారు. ఇతర పార్టీలు సైతం.. కాంగ్రెస్‌ పోరాటానికి మద్దతు ప్రకటించేందుకు ముందుకు వస్తున్నాయి.

Tags

Next Story