ఫలించని శ్రమ
బోరు బావిలో పడిన బాలుడ్ని రక్షించడం కోసం ఐదు రోజులుగా పడ్డ శ్రమ ఫలించలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని బయటకు తీసినప్పటికీ చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నెల6న పంజాబ్‌లో బోరు బావిలో పడ్డ ఆ రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడయ్యాడుగా బయటకు వచ్చాడు. తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సహాయక సిబ్బంది సురక్షితంగా బాలున్ని బయటకు తీయడంతో సంతోషపడ్డ పిల్లాడి తల్లిదండ్రులకు అంతలోనే చేదు వార్త వినాల్సివచ్చింది.
పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా భగవాన్‌పురలో ఈ నెల6న ఫతేవీర్‌సింగ్ అనే రెండేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 110 ఫీట్ల లోతులో బాలుడు ఇరుక్కుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. బాలుడిని కాపాడేందుకు బోరుకు సమాంతరంగా బావి తవ్వారు. ఎప్పటికప్పుడు బాలుడి కదలికలను గమనిస్తూ..బోరులో ఆక్సిజన్ పంపించారు. లోతులో పడిపోవడంతో బాలున్ని తీయడం సహాయక సిబ్బందికి కష్ట సాధ్యంగా మారింది. దాదాపు ఐదు రోజులు శ్రమించి ఎట్టకేలకు చిన్నారిని బయటకు తీసింది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది.
ఐదు రోజుల పాటు బావిలోనే ఉండడంతో అనారోగ్యానికి గురైన బాలుడు ఫతేవీర్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొనఊపిరితో ఉన్న ఆ చిన్నారికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ డాక్టర్స్ కృషి ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆ బాలుడు కన్నుమూశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com