త్వరలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ?

త్వరలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ?
X

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారా? రెండేళ్లు ముందుగానే కారాగారం నుంచి బయట పడనున్నారా? ఇప్పుడిదే చర్చ తమిళనాట జోరందుకొంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా శశికళను విడుదల చేయడానికి జైళ్ల శాఖ... కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబరులో శశికళ విడుదల అవుతారన్న వార్తలతో చిన్నమ్మ శిబిరంలో సంతోషం నెలకొంది.

జయలలిత అక్రమాస్తు కేసులో శశికళను ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు దోషిగా తేల్చిన సుప్రీం.. నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2017 ఫిబ్రవరిలో దోషిగా కోర్టు తీర్పు ఇవ్వడంతో సీఎం పగ్గాలు చేపట్టాలనుకున్న శశికళ ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరితో శశికళ జైలు శిక్ష కాలం రెండేళ్లు ముగిసింది. ఈ కాలంలో ఆమె జైలులో నడుచుకున్న విధానాన్ని సత్ప్రవర్తన పరిధిలోకి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ముందుస్తుగానే శశికళను విడుదల చేయాడానికి సన్నాహాలు జరుగుతుండడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు శశికళ విడుదలను కొందరు తప్పుబడుతున్నారు. జైలు నుంచి ఇష్టారాజ్యంగా షాపింగ్‌కు వెళ్లి వస్తున్న వీడియోలు బయటకు రావడం... గతంలో కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కొందరు ఆ శాఖ డీజీపీ మీదే ఆరోపణలు చేయడం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు.

Tags

Next Story