తొలిరోజే సమీక్షలతో దూకుడుగా కనిపించిన ఏపీ మంత్రులు
ఏపీలో ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఇప్పటికే ప్రమాణ స్వీకారాలు చేసిన మంత్రులు.. తమ విధుల్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో అడుగుపెట్టారు. తొలిరోజే సమీక్షలతో దూకుడుగా కనిపించారు.
వైసీపీ ఎన్నికల హామీ నవరత్నాల్లో బీసీ సంక్షేమానిది పెద్దపీట అన్నారు ఆ శాఖ మంత్రి శంకర నారాయణ. మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2 లక్షల 10 వేల మంది రజకులు, 80 వేల మంది నాయీ బ్రాహ్మణులకు 10 వేల చొప్పున సాయం అందించేందుకు ప్రతిపాదనలపై తొలి సంతకం చేశారాయన.
ఏపీలో త్వరలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామని రెవెన్యూ శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. భూసేకరణలో మార్కెట్ రేటు ప్రకారమే ధరలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లు సుబాష్ చంద్రబోస్ తెలిపారు.
ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చెరుకువాడ శ్రీరంగనాథ రాజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్‌లోకి పూజాదికాలు నిర్వహించి అడుగు పెట్టారాయన. మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో 4వ బ్లాక్‌లోని తన కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. స్టడీ సెంటర్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. సీఎం జగన్‌కు ఎంతో ఇష్టమైన శాఖను తనకు అప్పగించారని కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com