ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి..
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మినహా సభ్యులందరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత.. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. శ్రీకాకుళానికి చెందిన తమ్మినేని సీతారాంని స్పీకర్‌గా వైసీపీ ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నిక రేపు లాంఛనం కానుంది..
అంతకుముందు ఏపీలో 15వ శాసనసభ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. మొదట ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. తరువాత ఇతర మంత్రులు ప్రమాణం చేశారు. మండలి సభ్యుడు అవ్వడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రమాణ స్వీకారం చేయలేదు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొదట నా ఆరాధ్య నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి పేరుతో ప్రమాణ స్వీకారం చేశారు శ్రీధర్ రెడ్డి.. నిబంధనల ప్రకారం వ్యక్తులపై ప్రమాణ స్వీకారం చెల్లదని అధికారులు చెప్పడంతో.. మరోసారి చివర్లో శ్రీధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా 175 మంది ఎమ్మెల్యేలకు గాను.. 173 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తొలిరోజు సభకు గైర్హాజరయ్యారు. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com