గత ప్రభుత్వంలో వారి వద్ద పనిచేసిన వాళ్లను తీసుకోవద్దు.. సీఎం జగన్ ఆదేశం

పాలనాపరమైన అంశాలన్నింటిపైనా ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్.. డిప్యూటీ సీఎంలు, మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకాలపై కూడా తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వాళ్లను ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశించారు. ఓఎస్డీ, వ్యక్తిగత కార్యదర్శి, పీఏల నియామకాలన్నీ.. తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. జగన్ సూచన మేరకు సీఎం సలహాదారు అజేయ కల్లం దీనిపై నోట్ విడుదల చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త మంత్రుల కార్యాలయ సిబ్బంది నియామకాల విషయంలో వారికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఐతే.. కొన్నాళ్లుగా ఈ సంప్రదాయం మారింది. గతంలో చంద్రబాబు సైతం.. మంత్రుల PSలు, PAలుగా ఎవరున్నారనే దానిపై తుది నిర్ణయం తీసుకునే ముందు తన వద్దకు సమాచారం తెప్పించుకునే వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం ఇదే తరహాలో.. మంత్రుల కార్యాలయ సిబ్బంది నియామకాలపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం సచివాలయంలో కొత్త మంత్రులకు ఛాంబర్లు సిద్ధమవుతున్నాయి. కొందరు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించగా.. మరికొందరు ఒకట్రెండు రోజుల్లో ఆయా కార్యాలయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈలోపు నియామకాల విషయంలో తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా.. సీఎం జగన్ అందరికీ దిశానిర్దేశం చేశారు. పేషీల్లో సిబ్బంది నియామకం పూర్తిగా తనకు తెలిసే జరగాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com