మరో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం

మరో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలకు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్న మోదీ ప్రభుత్వం, తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక సామర్థ్యాలను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త స్పేస్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త ఏజెన్సీ ద్వారా అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదర్కోవడానికి అవసరమైన అధునాతన ఆయుధ వ్యవస్థను, సాంకేతికను మెరుగుపరచనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశమైంది. అంతరిక్షంలో సవాళ్లు, భవిష్యత్తు ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. విస్తృత మంతనాల తర్వాత కొత్త ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ పేరుతో నూతన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. అంతరిక్ష యుద్ధంలో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే ఆయుధ వ్యవస్థను, సాంకేతికతను ఈ ఏజెన్సీ రూపొందిస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.

త్వరలోనే బెంగళూరులో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ర్యాంక్‌ అధికారి పర్యవేక్షణలో డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీని నెలకొల్పనున్నారు. డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీకి రూపురేఖలు తీసుకొచ్చే పని కూడా ప్రారంభమైంది. సంయుక్త కార్యదర్శి స్థాయి శాస్త్రవేత్త సారథ్యంలో ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ ఏజెన్సీలో త్రివిధ దళాల అధికారులతో సహకారంతో కలిసి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తల బృందం ఉంటుంది. ఈ ఏడాది మార్చ్‌లో ఉపగ్రహ విధ్వంస క్షిపణి పరీక్షను మనదేశం విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఆ సామర్థ్యం కలిగిన అగ్ర దేశాల సరసన మనదేశం చేరింది. యుద్ధ సమయాల్లో భారత ఉపగ్రహాల జోలికి శత్రువులు రాకుండా రక్షించుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.

Tags

Next Story