తెలంగాణ స్పీకర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ స్పీకర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. సీఎల్పీని టీఆర్ఎస్‌ ఎల్పీలో విలీనం చేయడాన్ని తప్పుపడుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌తో పాటు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. కేసు విచారణ నాలుగు వారాలు వాయిదా పడింది.

శాసనసభ్యులు పార్టీ మారడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.. సీఎల్పీని టీఆర్‌ఎస్ఎల్పీలో విలీనం కోరుతూ లేఖ ఇచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో వాళ్లంతా మీడియా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగబద్ధంగా విలీనం జరిగిందని.. దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. చేతి నీడలో తమ రాజకీయ భవిష్యత్‌పై భరోసా లేకపోవడం వల్లే కారులోకి జంప్ చేశామన్నారు. అవసరమైతే.. రాజీనామా చేసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉందని.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని.. అందుకే పార్టీ వీడామని ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రజలకు కూడా కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయిందన్నారు. 12 మంది ఎమ్మెల్యేలం చర్చించుకునే సిఎల్పీని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశామన్నారు. కాంగ్రెస్ నాయకులు చిల్లరమల్లర విమర్శలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని గండ్ర హెచ్చరించారు. 32 జిల్లా పరిషత్‌లలో గులాబీ జెండా ఎగరడమే... తమ నిర్ణయానికి ప్రజామోదమని 12 మంది అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story