కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం..
తెలంగాణలో దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమలకు నీరు అందించే మహా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. దేశ నీటి పారుదల రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నెల నుంచే నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానవ నిర్మిత అద్భుతంగా నిలుస్తుందని ఇప్పటికే ప్రశంసలు అందుకున్న ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ నెల 21న ప్రారంభానికి సిద్ధమైంది..
కాళేశ్వరం ద్వారా.. మేడిగడ్డ దగ్గర సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టి.ఎం.సి.లను ఎత్తిపోయడానికి అనువుగా పంపుహౌజులు నిర్మించారు. ఇంత పెద్ద ఎత్తున నీటిని లిప్టు చేయడానికి దేశంలో గతంలో ఎన్నడూ వాడనంత పెద్ద సైజు పంపులను వాడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజిలు నిర్మించారు. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను కూడా ఈ నీటితోనే నింపుతారు. దీంతో తెలంగాణలో మొత్తంగా 199 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది.
ఇటీవలే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని పలు పంపుహౌజ్‌లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుండడంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ తన ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ప్రగతి భవన్‌కు సతీసమేతంగా వెళ్లిన జగన్.. కేసీఆర్‌తో మర్యదపూర్వకంగా భేటీ అయ్యి తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. జగన్ ఆహ్వానం మేరకు కేసీఆర్ విజయవాడ వెళ్లి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో ముందుకు సాగాలని ఇరువురు ముఖ్యమంత్రులు ఆకాంక్షించారు. అందులో భాగంగానే జగన్‌ను ముఖ్య అతిథిగా కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com