నిన్నటి వరకు రాముని చుట్టూ రాజకీయం.. ఇప్పుడు ఆ విగ్రహం చుట్టూ..

నిన్నటి వరకు రాముని చుట్టూ రాజకీయం.. ఇప్పుడు ఆ విగ్రహం చుట్టూ..

బెంగాల్‌లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటి వరకు రాముని చుట్టూ రాజకీయం చక్కర్లు కొడితే, ఇప్పుడు విగ్రహం చుట్టూ పాలిటిక్స్ పరుగులు పెడుతు న్నాయి. ప్రముఖ సంఘసంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. అల్లర్ల కారణంగా కూలిపోయిన విద్యాసాగర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పున:ప్రతిష్టించారు. కోల్‌కతాలోని పాఠశాలలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని దీదీ ఆవిష్క రించారు. విద్యాసాగర్ కాలేజీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బెంగాల్ సంస్కృతిని దెబ్బతీయడానికి కమలదళం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయనే వార్తలపై దీదీ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 14న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోల్‌కతాలో రోడ్‌షో నిర్వహించారు. ఆ క్రమంలో చెలరేగిన అల్లర్లలో దుండగలు విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో వివాదం మొదలైంది. విగ్రహ విధ్వంసం రాజకీయ రంగు పులుముకుంది. విద్యాసాగర్ విగ్రహాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అపవిత్రం చేసిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కూలిన చోటే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ, విగ్రహాలను ధ్వంసం చేసే అలవాటు బీజేపీకే ఉందని ఎదురుదాడి చేశారు. విగ్రహ నిర్మాణానికి బీజేపీ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదన్న మమత, బెంగాల్‌కు సొంతంగా వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు.

మొత్తానికి బెంగాలీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి మమతా బెనర్జీ అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. హిందూత్వ-జాతీయవాదాలను మిళితం చేసి కమలదళం చొచ్చుకు వస్తుండడంతో అందుకు విరుగుడుగా ప్రాంతీయతను దీదీ వాడుకుంటున్నారు. ఈ ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తున్న కమలదళం, ఆచితూచి స్పందిస్తోంది. సెంటిమెంట్ అటాక్‌కు బలంగా రివర్స్ అటాక్ ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story