గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోన్న వాయు తుఫాను

గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోన్న వాయు తుఫాను

వాయు తుఫాను గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. అరేబియా సముద్రంలో రెండు రోజుల కిందట ఏర్పడ్డ అల్ప పీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారుతోంది. ఈ తుఫాన్‌కు వాయు అని నామకరణం చేశారు. గురువారం ఉదయం ఇది వెరావల్ కోస్తా తీర ప్రాంతాన్ని తాకనుంది. ఆ సమయంలో గంటకు 155 కీలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రంలో అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులతో ప్రజాజీవనం అస్తవ్యస్తం కావచ్చని భావించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

ముంబైకు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయు తుఫాను.. మరింత బలపడుతోంది. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో బాటు సుమారు 10 జిల్లాల నుంచి అప్పుడే 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను, బీ ఎస్ ఎఫ్ సిబ్బందిని సన్నద్ధం చేశారు.

ఇప్పటికే గుజరాత్‌ వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. విమానాలు, రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుందని భావించిన ప్రభుత్వం.. కొన్ని మార్గాల్లో వీటిని రద్దు చేయడమో, దారి మళ్లించడమో చేసినట్టు అధికారులు తెలిపారు. గాంధీనగర్ లోని ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ లో సీఎం విజయ్ రూపానీ సహాయక చర్యల సన్నాహాలను సమీక్షించారు. స్కూళ్ళు, కళాశాలలకు ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. గత నెలలో సంభవించిన ఫొని తుఫాన్ 60 మందిని బలితీసుకొని ఒడిశాను అతలాకుతలం చేసింది.. ఇప్పుడు వాయు తుఫాను గుజరాత్‌ను భయపెడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story