కొడుకును ఉప ముఖ్యమంత్రి చేయాలని వ్యూహాలు రచిస్తున్న తండ్రి

కొడుకును ఉప ముఖ్యమంత్రి చేయాలని  వ్యూహాలు రచిస్తున్న తండ్రి

వారసుడికి ప్రమోషన్ కల్పించడంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే బిజీ అయ్యారు. మరో మూడు నెలల్లో రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. తన తనయుడు ఆదిత్య థాక్రేను మెయిన్‌స్ట్రీమ్‌ పాలిటిక్స్‌లో, నిత్యం వార్తల్లో ఉంచేందుకు తంటాలు పడుతున్నారు. ఇప్పటికే పార్టీలో యంగ్‌ టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్యను.. ఉప ముఖ్యమంత్రి చేయాలని ఉద్దవ్ కోరుతున్నారు.

మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ కాలపరిమితి నవంబర్ 15తో ముగుస్తుంది. మూడు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని పార్టీలు అంచనా వేస్తున్నాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో తన మంత్రివర్గాన్ని ఫడ్నవీస్‌ విస్తరిస్తాని.. ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో తన ఏకైక డిమాండ్‌ను బీజేపీ ముందు పెట్టారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. తన 29 ఏళ్ల కుమారుడు ఆదిత్య థాక్రేను ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాతికేళ్ల స్నేహబంధాన్ని తెంచుకుని బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. అటు.. కాంగ్రెస్, ఎన్సీపీ పరిస్థితీ అంతే. 15 ఏళ్ల ఫ్రెండ్‌షిప్‌ను కాదనుకుని విడివిడిగా బరిలోకి దిగాయి. బీజేపీ 122 సీట్లలో గెలిచి.. అతిపెద్ద పార్టీగా అవతరించగా.. శివసేన సాయంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి దుమ్మరేపాయి బీజేపీ, శివసేన. అదే ట్రెండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోను కొనసాగుతుందని అంతా భావిస్తున్నారు. ఈలోపే తన తనయుడు ఆదిత్య థాక్రేను ఉప ముఖ్యమంత్రి చేయాలని ఉద్ధవ్ తహతహలాడుతున్నారు.

లా గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య థాక్రే.. ఇప్పటికే పార్టీపై పట్టు సాధించారు. శివసైనికుల్లో ఆయనకు మంచి పేరుంది. యువసేన అధ్యక్షుడుగా ప్రజలకు చేరువ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి అవడం.. ఎన్నికల సమయంలో ప్లస్‌ అవుతుందని ఉద్ధవ్ అంచనా. శివసేన పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోను నెంబర్‌-2గా ఆదిత్యను ప్రొజెక్ట్ చేయాలని ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. సీఎం ఫడ్నవీస్ సొంత టీమ్‌ను రూపొందించుకునే పనిలో ఉండగా.. మిత్రపక్షం నుంచి డిమాండ్‌ రావడాన్ని కమలనాథులు సైతం ఊహించలేదు. పైగా.. ఆదిత్య థాక్రే చట్టసభ సభ్యుడు కాడు. అయినా.. డిప్యూటీ సీఎం అవడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నిబంధనల మేరకు ఆరు నెలల్లో చట్టసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఆదిత్య ప్రత్యేకంగా చట్టసభ సభ్యుడు కావాల్సిన అవసరమే ఉండదు.

గతంలో పదవుల విషయంలో పట్టువిడుపులకు ఆస్కారం ఇచ్చిన శివసేన ఇప్పుడు పదవుల విషయంలో పట్టుదలగా ఉంది. కేంద్రంలోను డిప్యూటీ స్పీకర్ పదవిని కోరుతోంది. తమ పార్టీ తరఫున గజానన్ కీర్తికార్‌ పేరును బీజేపీ ముందు ప్రతిపాదించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని తాము డిమాండ్ చేయడం లేదని.. మిత్రపక్షంగా తమ హక్కని వాదిస్తోంది. దానిపైనా కమలనాథుల నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు స్టేట్‌లో.. ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతోంది. ఎన్నికలకు గట్టిగా మూడు నెలల ముందు ఆదిత్య థాక్రేకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే భావన కొందరు కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. మరి, బీజేపీ కాదంటే.. కుదరదంటే.. కుమారుడి విషయంలో ఉద్ధవ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story