ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు భద్రతను కుదించడంపై టీడీపీ అభ్యంతరం..

చంద్రబాబు భద్రతను కుదించడంపై టీడీపీ అభ్యంతరం..
X

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతను కుదించడంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిన్న అసెంబ్లీకి వచ్చిన సమయంలో కాన్వాయ్‌లో వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. సుదీర్ఘ కాలం సీఎంగా, విపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్నారు. చంద్రబాబు బయటకు వెళ్లేప్పుడు రోడ్ క్లియరెన్స్, సర్కిల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గతంలో YS హయాంలోనూ ఇలాగే చేశారని.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రతను పునరుద్ధరించారని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసిన నేపథ్యంలో.. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు జెడ్ ప్లస్ కేటగిరిలో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అలాగే కేంద్రం NSG భద్రతను కూడా ఇచ్చింది. ఒకవేళ ఈ సెక్యూరిటీ విషయంపై ఏమైనా మార్పులు చేయాలంటే రాష్ట్ర కమిటీలో చర్చించాక నిర్ణయం తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండా భద్రత తగ్గించారని టీడీపీ నేతలు అంటున్నారు. లోకల్‌ ఎస్కార్ట్ ఎత్తివేయడం, రోడ్డు క్లియరెన్స్ తీసేయడం లాంటివి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని ఆరోపిస్తున్నారు.

Next Story

RELATED STORIES